తెలంగాణ పర్యాటక శాఖకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం

373

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఈ సంవత్సరం అరుదైన రెండు జాతీయ అవార్డులను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ గెలుచుకుంది. గత 4 ఏళ్లు గా తెలంగాణ ప్రభుత్వం వరసగా వివిధ విభాగాలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటక పురస్కారాలను అందుకుంటుంది. తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటకులకు పర్యటన ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం కోసం రూపొందించిన ” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ” అనే మొబైల్ యాప్ కు, ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగం లో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి పర్యాటక అవార్డులను గెలుచుకున్నాయి. ” ఐ ఎక్స్ ప్లోర్ తెలంగాణ ” అనే మొబైల్ యాప్ కు ఐటీ రంగంలో అత్యంత విన్నూత్న ఉపయోగం – సోషల్ మీడియా, మొబైల్ అనుసంధానం, వెబ్ సైట్ విభాగంలో తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన యాప్ కు అందరి ప్రశంసల తో పాటు అరుదైన అవార్డును గెలుచుకుంది.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక దినోత్సవం లో భాగంగా ఇండియా టూరిజం ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, యూఎస్ డబ్ల్యూటీవో సెక్రెటరీ జనరల్ జురాబ్ పొలాలికశవిలి, కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ల చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డు ను స్వీకరించారు.