అత్యాచార నిందితుడికి సుప్రీం బంప‌ర్ ఆఫ‌ర్‌

240

ఏ వ్య‌క్తి అయినా ఓ మైన‌ర్ బాలిక‌పై అత్య‌చారం చేస్తే ఈ స‌మాజం ఏం కోరుకుంటుంది? క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతుంది.

న్యాయ వ్య‌వ‌స్థ ఆ దిశ‌గానే ఆలోచిస్తుంది. కానీ సుప్రీం కోర్టు మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

బాలికపై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న‌మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కంపెనీ టెక్నీషియన్ మోహిత్ సుభాష్ చవాన్‌కు హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది.

దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితుడికి ఓ అవకాశం ఇచ్చింది.

బాధితురాలిని వివాహం చేసుకుంటే సహాయం చేస్తామని స్వ‌యంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ధర్మాసనం వ్యాఖ్యానించింది.

చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఒకవేళ బాధితురాలిని పెళ్లి చేసుకుంటే సాయం చేస్తాం.

కాదంటే ఉద్యోగం పోగొట్టుకుని జైలుకు వెళ్తావు అని కూడా ఆ ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది.

ఎందుకంటే ఆ బాలికను ఆకర్షించి అత్యాచారానికి పాల్పడ్డావు అని నిందితుడి తరఫున హాజరైన లాయర్‌‌తో ధర్మాసనం పేర్కొంది.

అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి కోరింది. కానీ ఆ బాలిక నిరాకరించినట్లు సమాచారం.

ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేసుకుంటానని ఆ నిందుతుడు లిఖితపూర్వకంగా రాసిచ్చాడు.

ఆ సమయంలో అతనిపై అత్యాచారం ఫిర్యాదు నమోదయ్యింది అని నిందితుడు చవాన్ తరఫు లాయర్ పిటిషన్ వేశాడు.

‘మీరు ఆమెను వివాహం చేసుకుంటారా?’ అని ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే ప్రశ్నించారు.

దీనికి చవాన్ లాయర్ బదులిస్తూ సూచనలు తీసుకుంటామని తెలిపారు.

‘యువతిని మోహించి, అత్యాచారం చేసే ముందు మీరు ఆలోచించి ఉండాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని మీకు తెలుసు’ అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.

‘పెళ్లి చేసుకోమని మేము బలవంతం చేయడంలేదు. మీకు ఇష్టమైతే మాకు తెలియజేయండి.

లేకపోతే ఆమెను వివాహం చేసుకోమని బలవంతం చేస్తున్నామని మీరు చెబుతారు’ అని అన్నారు.

దీంతో తన క్లయింట్‌ను సంప్రదించిన తర్వాత సమాధానం ఇస్తామని నిందితుడి తరఫు లాయర్ తెలిపారు.

‘వాస్తవానికి ఆమెను నేను పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఆమె నిరాకరించింది.

ప్రస్తుతం నాకు వివాహమైంది కాబట్టి ఇప్పుడు సాధ్యం కాదు’ అని చవాన్ తెలియజేశాడు.

‘నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఒక వేళ అరెస్టయితే విధుల నుంచి సస్పెండ్ అవుతాను’ అని అన్నాడు.

ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుని ‘అందుకే మేము మీకు ఈ అవకాశం ఇచ్చాం.

అరెస్టుపై నాలుగు వారాల పాటు స్టే విధిస్తాం.

అప్పుడు మీరు సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు’ అని పేర్కొంది.

ట్రయల్ కోర్టు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీచేయగా.. హైకోర్టు దానిని రద్దుచేసింది.

తాజాగా సుప్రీంకోర్టు అతడికి ఊరట కలిగించింది. నాలుగు వారాల పాటు అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.

తర్వాత సాధారణ బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.