రూ.500కే ఎల్ఈడీ టీవీ

280

ఎల్ఈడీ టీవీ కొన‌డం సామాన్యుడికి సాధ్యం అవుతుందా? ఆ టీవీ కొనాలంటే వేల రూపాయ‌లు మ‌న జేబులో ఉండాలి.

క‌నీసం ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొనాడానికి కూడా స‌గ‌టు జీవి ఆలోచిస్తాడు. అలాంటిది ఎల్ఈడీ టీవీ రూ. 500ల‌కే అంటే. ఇంకేముంది అప్పు చేసి అయినా కొంటారు.

కానీ ఇది షో రూమ్ రేట్ కాదు. ఓ దొంగ‌ల ముఠా రేటు. అవునండి! కృష్ణాజిల్లాలో ఓ దొంగలముఠా రూ.500లకే ఎల్ఈడీ టీవీలను అమ్మ‌కానికి పెట్టింది.

ఎంత దొంగతనంగా తీసుకొచ్చినా మరీ 500 రూపాయలకే టీవీ అమ్మడమేంటనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సోనోవిజన్ షో రూమ్ ఉంది.

అక్కడి నుంచి భీమవరానికి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఓ మినీ వ్యాన్లో లోడ్ చేశారు. అయితే ఈ వ్యాన్ పై కన్నేసిన యూపీ దొంగల ముఠా చాకచక్యంగా చోరీ చేసింది.

వ్యాన్‌ను ఎవరికీ అనుమానం రాకుండా ఎనికేపాడు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ తీసుకెళ్లాల‌ని మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ మార్గ మధ్యంలో కథ అడ్డం తిరిగింది.

వ్యాన్‌లో డీజీల్ అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు.. వ్యాన్‌లో చూస్తే లక్షలాది రూపాయల ఎలక్ట్రానిక్ వస్తువులున్నాయి.

దీంతో చేసేది లేక‌ డీజీల్ డబ్బుల కోసం ఎల్ఈడీ టీవీని రూ.500లకు అమ్మ‌డం మొద‌లు పెట్టారు. ఓ ఐదువేలో పదివేలో అయితే కావాల్సిన వాళ్లు వాటిని కొనుక్కునేవారు.

మరీ రూ.500లకు బేరం పెట్టడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. సైలెంట్‌గా విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించారు.

చోరీ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ రూ.9 లక్షల వరకు ఉంటుంది. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దొంగల ముఠా ఇచ్చిన సమాచారం మేరకు సోనో విజన్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

లక్షలాది రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు తిరిగి దొరకడంతో షోరూమ్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

మొత్తానికి పక్కా స్కెచ్‌తో పట్టపగలే దొంగతనం చేసిన యూపీ ముఠా డీజీల్ కు డబ్బుల్లేక దొరికిపోవడంతో అంద‌రూ న‌వ్వుకున్నారు.