ప్రస్తుతం ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో రెండు ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కుతుండగా, మరొకటి లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ రెండు చిత్రాలపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలోనే తాను ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తానని ప్రకటించిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మళ్లీ ఈ ప్రాజెక్ట్ గురించి ఊసే ఎత్తలేదు. తాజాగా ఆయన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు లక్ష్మీ పార్వతి పాత్రలో సంచలన నటి శ్రీ రెడ్డిని ఎంపిక చేశామని అన్నారు. అయితే లక్ష్మీ పార్వతి పాత్రలో నటించేందుకు ఆమె ఓకే చెప్పగా, కథ వింటే కాస్త వెనుకంజ వేస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు కేతిరెడ్డి.
లక్ష్మీ పార్వతి పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ ఉంటాయి కాబట్టి ఆమె అభ్యంతరం చెప్పొచ్చేమోనని కేతిరెడ్డి అంటున్నారు. వీరగ్రంథం వెంకట సుబ్బారావు జీవితంలోకి అడుగుపెట్టిన లక్ష్మీపార్వతి .. ఆ తర్వాత ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించడం .. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి ఈ సినిమా ఉంటుంది” కేతిరెడ్డి వెల్లడించారు.