ఓ అమ్మాయిల హాస్టల్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో రహస్య కెమెరాలు బైటపడ్డాయి. దీంతో యజమాని సంపత్‌రాజ్ (48)ను మంగళవారం అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో జరిగింది. రియల్ ఎస్టేట్‌లో నష్యం రావడంతో అమ్మాయిల హాస్టల్ ప్రారంభించిన సంపత్ విద్యుత్ ప్లగ్గులలో, దుస్తుల అలమారాల్లో రహస్యంగా కెమెరాలు బిగించినట్టు బైటపడింది. అవి అత్యాధునిక సౌండ్ సెన్సిటివ్ కెమెరాలు కావడం గమనార్హం. అంటే మనుషుల అలికిడికి కెమెరాలు రికార్డింగ్ ప్రారంభిస్తాయి.
హాస్టల్‌లో ఏడెనిమిది మంది అమ్మాయిలు ఉంటున్నారు. వారిలో ఒకరు ఎలక్ట్రిక్ డ్రయ్యర్ ప్లగ్గులో పెట్టేందుకు ప్రయత్నించగా పిన్ను ఎంతకూ లోపలికి వెళ్లలేదు. ఆమె దానిని విప్పేసినప్పుడు వెనకాల ఉన్న కెమెరా బయటపడింది. ఆమె నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు వచ్చి తనిఖీ చేయడంతో ఆరుదాకా కెమెరాలు బయటపడ్డాయి. ఎవరికీ తెలియగూడదనే ఉద్దేశంతో నిందితుడు సంపత్ వాటిని స్వయంగా బిగించినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఐటీ చట్టం కింద పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇప్పటిదాకా ఏవైనా దృశ్యాలు రికార్డయ్యాయా? ఏదైనా సైట్‌లో వాటిని పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.