దేశంలోనే నంబర్‌ 1 శ్రీమంతుడు సల్మాన్‌

358
richest indian celebrity

భారతీయ సెలబ్రిటీల సంపాదనపై ప్రతిష్ఠాత్మక సంస్థ ఫోర్బ్స్‌ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబరు నుంచి 2018 సెప్టెంబరు మధ్య దేశంలోనే అత్యధికంగా ఆర్జించిన 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో సినీ తారలు సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, దీపికా పదుకొణె, ఆమీర్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవగణ్‌ తొలి పది స్థానాల్లోపు నిలిచారు. ఈ జాబితాలో పలువురు తెలుగు అగ్రకథానాయకులకూ స్థానం దక్కడం విశేషం.




 

అగ్రస్థానంలో మూడోసారి

ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం సాధించి సత్తా చాటారు సల్మాన్‌ ఖాన్‌. రూ.253.25 కోట్ల ఆదాయంతో ఆయన ఈ ఘనత సాధించారు. కాగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం సల్మాన్‌కు వరుసగా ఇది మూడో ఏడాది కావడం విశేషం. ఆయన గత రెండు చిత్రాలు ‘టైగర్‌ జిందా హై’, ‘రేస్‌ 3’లకు భారీ పారితోషికం అందుకోవడంతో పాటు పదుల కొద్దీ వాణిజ్య ప్రకటనలు, బిగ్‌బాస్‌, దస్‌ కా దమ్‌ రియాలిటీ షోలకు వచ్చిన సంపాదనతో అగ్రసానాన్ని నిలబెట్టుకున్నారు.

శతకం దాటేశారు

అక్షయ్‌ కుమార్‌ (రూ.185 కోట్లు), దీపికా పదుకొణె(రూ112.8 కోట్లు) సంపాదనలో శతకం దాటేశారు. వీరిద్దరూ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. వీరి తర్వాత ఆమీర్‌ ఖాన్‌(రూ.97.5 కోట్లు), అమితాబ్‌ బచ్చన్‌(రూ.96.17 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌(రూ.84.67 కోట్లు), అజయ్‌ దేవగణ్‌(రూ.74.5 కోట్లు) వరుసగా 6,7,8,10 స్థానాలు సొంతం చేసుకున్నారు. ఆలియా భట్‌(రూ.58.83 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌(రూ.56 కోట్లు), వరుణ్‌ ధానవ్‌(రూ.49.58 కోట్లు), అనుష్క శర్మ(రూ.45.83 కోట్లు), రణ్‌బీర్‌ కపూర్‌(రూ.44.5 కోట్లు), సంజయ్‌ దత్‌(రూ.37.85 కోట్లు), కత్రినా కైఫ్‌(రూ.33.67 కోట్లు), కరీనా కపూర్‌(రూ.31 కోట్లు) ఆర్జించారు.


మన తారల సత్తా

తెలుగు చిత్రసీమకు చెందిన నటులు కూడా సంపాదనలో జోరుగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌(రూ.31.33 కోట్లు), ఎన్టీఆర్‌ (రూ.28 కోట్లు), మహేష్‌బాబు(రూ.24.33 కోట్లు), నాగార్జున(రూ.22.25 కోట్లు), అల్లు అర్జున్‌(రూ.15.67 కోట్లు), రామ్‌ చరణ్‌(రూ.14 కోట్లు), విజయ్‌ దేవరకొండ(రూ.14 కోట్లు) సంపాదనతో వరుసగా 24, 28, 33, 36, 64, 72, 72 స్థానాల్లో నిలిచారు. ‘భరత్‌ అనే నేను’తో ఘన విజయం అందుకున్న దర్శకుడు కొరటాల శివ రూ.20 కోట్ల ఆదాయంతో 39వ స్థానం దక్కించుకున్నారు.