విశ్వవిద్యాలయాల్లో ఆచార్య కొలువులభర్తీ ఎప్పుడో ?

364
recruitment of professors in universities

దేశాభివృద్ధిలో విద్య యొక్క ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్కరలేదు. అందులో ప్రామాణికత కలిగిన ఉన్నత విద్య ఎంతో అవసరం. అందుకే దేశవ్యాప్తంగా 1000 విద్యాలయాలు ఉంటే అందులో 54 కేంద్ర విశ్వ విద్యాలయాలు, 416 వివిధ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో గల విశ్వవిద్యాలయాలు, 125 డీమ్డ్ విశ్వ విద్యాలయాలు, 361 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, 159 జాతీయ విద్యాసంస్థలు, 7 రాష్ట్ర విద్యాసంస్థలు నెలకొనగా అందులో 3.74 కోట్ల విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు.

ఒక విశ్వవిద్యాలయం పరిపూర్ణంగా పనిచేయాలంటే దానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు మరియు ప్రభుత్వ నిధులు సకాలంలో అందాలి. అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది, ప్రయోగ వసతులు పూర్తి స్థాయిలో ఉండాలి. వీటితో పాటు విద్యార్థులకు తమ విద్యనభ్యసించుటలో భాగంగా ఏలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో స్కాలర్షిప్స్ మరియు ఫెలోషిప్ లు అందాలి. అందులో భాగంగానే  దేశవ్యాప్తంగానున్న విశ్వవిద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య , సహాచార్య కొలువులభర్తీ ప్రక్రియను మొదలుపెట్టి వీలైనంతత్వరగా పూర్తిచేయాలని యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ కోరి సంవత్సరాలు గడిచిపోయిన “ఎక్కడవేసిన గొంగడి అక్కడే” ఉండిపోయింది.

ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి నూతనంగా రాష్ట్రం సిద్ధించాక ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఏ ఒక్క నోటిఫికేషన్ పూర్తిస్థాయిలో నోచుకోలేని పరిస్థితి. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ కి అంతటి అదృష్టాన్ని నోచుకోలేదు. ఇంకొన్ని పోస్టులకు రోస్టర్ వ్యవస్థను పూర్తిచేయకపోవడంతో ఆగిపోయాయి. మరికొన్నికొలువులు కొత్తజోన్లు,వాటి పరిధిలోని కొలువులపై స్పష్టత రాకపోవడం వల్ల ఇబ్బంది. ఇంకా కోర్టుచిక్కులు, పరీక్ష నిర్వహణలో పలుమార్పులు తెచ్చి, కేంద్రం అనుమతులకు వేచిచూడటం ఇలా ఎన్నిరకాల కారణాలున్నా కొలువుల భర్తీ అసలు జరగటంలేదని అర్ధం.

కొలువులొస్తాయనే కోటిఆశలతో విద్యార్థులు ఉద్యమంలో పాల్గొంటే ముమ్మాటికీ వారి ఆశలు నిరాశలేలయ్యాయని చెప్పవచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, ఎన్ని అవార్డులు,పేరు ప్రఖ్యాతలు గావించిన, నియామకాల విషయంలో నిరుద్యోగులపాలిట శాపంగానే మారిపోయిందని చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో

  • ఉస్మానియా యూనివర్సిటీ
  • కాకతీయ యూనివర్సిటీ
  • జె.ఎన్.టి.యు.హెచ్
  • తెలంగాణ యూనివర్సిటీ
  • పాలమూరు యూనివర్సిటీ
  • మహాత్మాగాంధీ యూనివర్సిటీ
  • పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ
  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
  • బాసర రాజీవ్ గాంధీ నాలెడ్జ్
  • శాతవాహన యూనివర్సిటీ
  • కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ
  • పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ

ఇలా రాష్ట్రవ్యాప్తంగా 24 కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణలో దాదాపు 1500 కళాశాలలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి.

ప్రత్యేకంగా యూనివర్సిటీలలో ఆచార్య కొలువులభర్తీ నిరుద్యోగులపాలిట అందనిద్రాక్షలా మిగిలిపోయిందని చెప్పవచ్చు . ఈ కొలువులకు అర్హత సాధించాలంటే డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పూర్తి చేయాలి లేదా నెట్,సెట్, జేఆర్ ఎఫ్ క్వాలిఫైడ్ కావాలి. దాదాపు ఈ అర్హతలు సాదించాలంటే 30 నుండి 40 సంవత్సరాలు వయసు పడుతుంది. ఇలాంటి పోస్టులను గతంలో భర్తీచేసి దశాబ్దకాలం గడిచిన తర్వాత అంతటి అదృష్టాన్ని నోచుకోలేకపోయిందని చెప్పవచ్చు. కారణాలు అనేకం . . మొదట ఉమ్మడిఆంధ్ర ప్రదేశ్ లో కొలువుల భర్తీచేస్తే తెలంగాణ ప్రాంతంవారికీ అన్యాయం జరుగుతుందని భావించి, ప్రతివిద్యార్థి ఉద్యమంలో పాల్గొని, తెలంగాణ ఆవిర్భావంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలకపాత్ర పోషించారని యావత్తు ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే ఇది జగమెరిగిన నగ్నసత్యం.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ప్రత్యేకంగా పాత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న కొలువులను పరిశీలిస్తే 99 ప్రొఫెసర్లు, 270 అసోసియేట్ ప్రొఫెసర్స్ మరియు 692 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మొత్తం 1061 ఖాళీలున్నాయని లెక్కగట్టి నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశారు. కానీ ఆ ఆశలే వారిపాలిట ఆడియాశలయ్యాయి. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందుగా యూనివర్సిటీలకు శాశ్విత వైస్ ఛాన్సలర్ లేమితో రోస్టర్ సిస్టమ్ ను త్వరగా చేయడానికి కుదరలేదు.ఆ తర్వాత కొంతకాలానికి అన్నీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించి, యూనివర్సిటీలు సక్రమంగా నడవడానికి కృషిచేస్తూ, రోస్టర్ విధానం పూర్తిచేయడం, దానికి తెలంగాణ ప్రభుత్వం సైతం ఒప్పుకోవడం రేపో మాపో భర్తీ ప్రక్రియ పూర్తవుతుందన్నట్లు దినపత్రికల్లో ప్రకటనలు కాస్తా భరోసా ఇచ్చినట్లు కనిపించాయి.

వెంటనే తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మొదటిసారిగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించగా, ఎన్నో సాంకేతికపరమైన కారణాలతో ఖాళీలభర్తీకి నోచుకోలేదు. చూస్తుండగానే రెండు సంవత్సరాల పదవీకాలం ముగిసి మరల ఇంచార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ లతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఉపకులపతులతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను నియమించకపోవడం వలన సకాలంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రాంట్స్ , ప్రభుత్వం నిధులు, విద్యార్థుల ఫెలోషిప్ లు, ఇతర నిధులు రాబట్టడంలో ఆలస్యం నెలకొని విశ్వవిద్యాలయ పాలనావ్యవస్థ అస్తవ్యస్తంగా మారి విద్యార్థులను తీవ్రఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రెగ్యులర్ ఉపకులపతులు ఉన్నప్పుడే సాధ్యపడని  పనులు, ఇంచార్జ్ ల పాలనలో పనివత్తిడి కారణంగా సరైనదృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. ఇప్పటికైనా సెర్చ్ కమిటీలు ఏం చేస్తున్నాయో . . ? రాష్ట్ర ప్రభుత్వం ఉపకులపతుల నియామకం చేపడుతుందా . . ? ఆ తర్వాతనన్నా కొలువులభర్తీ కొనసాగించి ఉన్నత విద్యనభ్యశిస్తున్నా విద్యార్థులకు న్యాయం చేస్తుందా . . ? లేక ఇలాగే ఏళ్ళ తరబడి పార్ట్ టైం , కాంట్రాక్టు అభ్యర్థులతో పూట గడుపుతుందా ? ఎక్కడా స్పష్టత కనబడక దిక్కుతోచని స్థితిలో అత్యున్నత చదువులు చదివిన నిరుద్యోగులున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు .కొన్నాళ్ళు వేచిచూస్తే ఇలాంటి కొలువులపై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ విరమణ వయస్సువచ్చి అవకాశాలు చేజారిపోతాయోనన్న అనుమానం కూడా రాకమానదు.

అభివృద్ధి అనేది ఏదో ఒక్కరంగానికే పరిమితమైతే సరిపోదు, అన్నీ రంగాలలో సమభాగాలతో ఉండాలనే ప్రాథమిక విషయాన్నీ గ్రహించి ముందుకు వెళ్ళినప్పుడే అందరికి మేలు జరుగుతుంది. ప్రామాణికత కల్గిన విద్యగురించి ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా వివరించారు . . అభివృద్ధి అనే విషయంలో విద్య యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అదికూడా విద్యనభ్యసించిన వారికీ ఉద్యోగవకాశాలు వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయుల పాలనలో అష్టకష్టాలు పడుతున్న సందర్భాలలో 1911లో దాదాభాయి నౌరోజీ తమ అనుచరవర్గంతో బ్రిటిష్ ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళి, మీరు ఎన్నేళ్లయినా పాలించండి కానీ నాదేశంలో ఉచిత నిర్బంద విద్యను అమలుచేయాలని కోరిన ససేమిరా వారు ఒప్పుకోలేదు. 1947లో స్వాతంత్య్రం సముపార్జించిన తర్వాత 2009 లో కేంధ్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఉచిత నిర్బంధవిద్యకు చట్టాన్నిచేసి అమలు పరుస్తున్నది.అంటే దాదాపు శతాబ్దకాలం సమయం పట్టింది.

నేడు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యనందించడానికి పలురకాల ప్రయత్నాలు చేస్తూ 74 శాతానికి తీసుకొచ్చారు. కానీ విద్యపూర్తిచేసిన వారికీ అవకాశాలు లేకపోవడం దేనికి నిదర్శనమో ఎవ్వరికి అర్థంగానీ పరిస్థితి. ఉద్యోగులకు పీఆర్సీలు పెంచాలన్నా, నూతనంగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్న బడ్జెట్ తప్పనిసరి, ప్రభుత్వాలు చెప్పే సాకుకూడా అదే, రాష్ట్రఖజానా ఖాళీగా ఉన్నది.అందుకే ఆలస్యమవుతుందని,కానీ ఇక్కడ అర్థంగాని ప్రశ్నోక్కటి మిగిలిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ నుండి 2014లో తెలంగాణ విడిపోయి అవి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఆవిర్భవించినప్పుడు తెలంగాణలో మిగులుబడ్జెట్ ఉంటే, ఆంధ్రలో అప్పులఉబిలోనున్నది.అలాంటిది ఈ 7 సంవత్సరాలలో తెలంగాణలో ఎన్నో  కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో ఎలాంటి ఇబ్బందిలేదు. అలాగే ఆంధ్రలో కూడా ఎన్నో అభివృద్ధికార్యక్రమాలతో, నూతనపథకాలతో సరికొత్త ఒరవడికి నాందిపలుకుతూ, కొలువుల విషయంలో ఎంతోమంది నిరుద్యోగులపాలిట వరంలా నిలుస్తూ, కష్టకాలం నుండి గట్టెక్కుతూ పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నపుడు మనరాష్ట్రంలో ఆ పరిస్థితి లేనందున చింతించక తప్పనిపరిస్థితి.

ఏదిఏమైనా రాష్ట్రంలోనున్న మేధావివర్గం, పలు సామాజిక అభివృద్ధికి పాటుపడే స్వచ్ఛంద సంస్థలు, విభిన్న సంఘాలు, ప్రభుత్వ సలహాదారులు, రచయితలు, కవులు, కళాకారులు మరియు ప్రత్యేకంగా వివిధపత్రికల జర్నలిస్టులు ఈసమస్యను క్షున్నంగా పరిశీలించి ప్రభుత్వాలకు పలుసూచనలను, సమస్య పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం  ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలులేక కష్టాలుపడుతూ, కుటుంబాలను పోషించుకోలేని దీనస్థితిలోనున్న నిరుద్యోగుల జీవితాలను అర్ధంచేసుకోని,నిరుద్యోగనిర్మూలనకు కంకణం కట్టుకోని దేశంలోని పలురాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలని ఆశిద్దాం.

-డా. పోలం సైదులు