శాసనమండలి వలన కలిగే ప్రయోజనం ఎవరికి?

333
Who benefits from the Legislative council

భారతరాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో ప్రజలకుపయోగపడే శాసనాలను రూపొందించడానికి లోకసభ, రాజ్యసభలు ఎలాగుంటాయో.. రాష్ట్రంలో సైతం శాసనసభ, శాసనమండలి అనే రెండు సభలు కొలువుదీరాయి. కానీ శాసనమండలిని కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం కొలువుదీరిన ఆరాష్ట్ర ప్రభుత్వం పైననే ఉంటుంది. అందుకే దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ మరియు జమ్ముకాశ్మీర్ అనే ఏడు రాష్ట్రాలలో మాత్రమే రెండుసభలు కొనసాగుతున్నాయి. అంటే శాసనమండలి యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియకనే తెలుస్తుంది.

తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి స్వాతంత్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1958 నుండి1985 వరకు కొనసాగి,ఆపై రెండు దశాబ్దాలకుపైగా రద్దుచేసి, మరల 2007 నుండి నిరంతరంగా కొనసాగించడం జరుగుతుంది.

ప్రజాస్వామిక విధానంలో శాసనసభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నియామకమై వివిధ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యంవహిస్తూ గుర్తింపు, గౌరవం కలిగి ఉంటారు. కానీ శాసనమండలిలో క్రమంగా ఆసభ్యుల ప్రాధాన్యత నామమాత్రంగానే కొనసాగుతుందనడంలో నిజంలేకపోలేదు. అసలైన కారణాలు విశ్లేషిస్తే ముందుగా రాజ్యాంగం ప్రకారం ఎన్నిక విధానంలో పాల్గొనాలంటే అందరికీ సమానవకాశాలున్న కేవలం వివిధ రాజకీయపార్టీలకు చెందిన వ్యక్తులకే అలాంటి అవకాశాలు వస్తూ, నిస్వార్ధ సేవ చేయడానికి పూనుకున్న స్వతంత్ర అభ్యర్థులకు అందని ద్రాక్షలా మిగిలిపోవడం జరుగుతుంది.

అందుకే విభిన్న రంగాలలో పలువిషయాలు చర్చకురావాలని, రాజకీయపార్టీల ప్రమేయం లేకుండానే చట్టసభలలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించడంకోసం శాసనమండలి నిర్మాణం చేయడం జరిగింది. అందుకే దీనిని పెద్దలసభ అని, విధానపరిషత్ అని, మేధావుల సభ అని పలుపేర్లతో పిలవడం అందరికీ తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలోని శాసనమండలిలో మొత్తం 40మంది సభ్యులు ఉంటే అందులో 14మంది సభ్యులు శాసనసభ్యులచే, 14మంది సభ్యులు పంచాయతీరాజ్, మునిసిపాలిటీ, లోకల్ బాడీ సభ్యులచే, ముగ్గురుసభ్యులు పట్టభద్రులచే మరోముగ్గురు సభ్యులు ప్రభుత్వ ఉపాధ్యాయులచే మరియు ఆరుగురు సభ్యులు నేరుగా రాష్ట్రగవర్నర్ చే నామినేట్ అయ్యి ఆరు సంవత్సరాల పదవీకాలంతో, ప్రతి 2 సంవత్సరాలకు మూడువంతుల సభ్యులు పదవీకాలం ముగియడం, వారి స్థానాలలో నూతనంగా ఎన్నికవడం జరుగుతూవస్తుంది. ఈ ప్రక్రియలో రాజకీయ నేపథ్యంలేకున్నా చట్టసభలలోకి వెళ్లే అవకాశం లభిస్తుంది.

దీనికితోడు ఈ సభలో అమితమైన జ్ఞానము కలిగి సమాజంలోని పలుసమస్యలకు పరిష్కారమార్గాలను సూచిస్తూ,ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందిస్తూ అభివృద్ధికి దోహదపడేవారు.కానీ ప్రస్తుతం శాసనమండలి కలిగిన అన్నిరాష్ట్రాలలో అక్కడి రాజకీయపార్టీలు జోక్యం చేసుకుని ఆ సభను సైతం రాజకీయనియామకాలు చేసుకోవడానికి ఉపయోగపడేటట్లు చేస్తున్నారనడంలో ఎలాంటి అవాస్తవం  లేదు.

గవర్నర్ కోటాలో వివిధరంగాలకు చెందిన ఆరుగురుసభ్యులను నామినేట్ చేయించడానికి అధికారపార్టీ హస్తం లేకుండా కుదరని పరిస్థితి దాపురిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎమ్మెల్యేలు, లోకల్ బాడీ ద్వారా ఎన్నికయ్యే సభ్యులు కేవలం రాజకీయపార్టీలకు చెందిన వ్యక్తులే ఉంటారు. ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికయ్యే సభ్యులవద్దకు వచ్చేసరికి  ముందు రాష్ట్రంలో పలురకాల ఉపాధ్యాయ సంఘాలుగా ఏర్పడి, ఒక్కొక్క సంఘం ఒక రాజకీయపార్టీకి అనుబంధంగానో లేదా మద్దతుకోరుతూ ఏర్పడడం జరిగి, అందులో సైతం రాజకీయపార్టీల ప్రవేశం లేకుండా జరగని పరిస్థితి నెలకొంది.

చివరగా పట్టభద్రుల ద్వారా ఎన్నికయ్యే ముగ్గురుసభ్యుల విషయంలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు పోటీచేయడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో రెండుపట్టభద్రుల నియోజకవర్గాలలో ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో పలు రాజకీయపార్టీలు జోక్యం చేసుకుని తమ కార్యకర్తలచే గ్రామ స్థాయి నుండి మొదలుకొని ఛాలెంజ్గా తీసుకొని పనిచేయడంతో ఈదఫా అత్యధిక ఓటర్ల నమోదుజరిగి, ఎన్నికలు ఆసక్తికరంగా మారాయనడంలో నిజంలేకపోలేదు.

ఓటర్లనమోదు ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయపార్టీల నాయకులు అభ్యర్థుల మొబైల్ నెంబర్లను సేకరించి వారిని ఆకర్షించే విధానంలో నిమగ్నమై పోయారు.వీలైతే వివిధ బహుమతులిచ్చి లేదా ఓటుకు కొంతనగదును ఆశచూపి గెలుపొందాలని చూస్తున్నారు.రాజకీయపార్టీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తే ఇంకెక్కడ రాజకీయ నేపథ్యం లేనివారికి అవకాశం వస్తుంది? అంటే శాసనమండలి అనేది రాజకీయ కొలువులు నియమించడానికే పనికొస్తుందా అనే అనుమానం కలగక మానదు.

శాసనసభతో పోలిస్తే శాసనమండలికి ప్రజాదారణ చాలాతక్కువే అని చెప్పవచ్చు. సభలు నిర్వహిస్తున్న సమయంలో కేవలం శాసనసభ యొక్క ప్రత్యక్ష ప్రసారాలను చేస్తుంటారు. కారణం అందులోనే ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు ఉండటంతో ఆప్రాధాన్యత సంతరించుకున్నది. ఎప్పుడైనా ముఖ్యమంత్రి శాసనమండలిలో మాట్లాడినప్పుడు ప్రజలకు ఇంకొక సభకూడా ఉన్నదా?అనేవిషయం తెలుస్తుంది. అలాగే ఏవైనా ఆర్థికపరమైన బిల్లును ఆమోదించే క్రమంలో శాసనమండలి  ప్రాధాన్యత నామమాత్రమేనని చెప్పకతప్పదు.

ఈసభ నుండి ప్రభుత్వానికి ఎలాంటి సలహాలు,సూచనలు అందించిన తుదినిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుంది. అలాంటప్పుడు శాసనమండలి వలన సామాన్యప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటో అర్థంకాదు. ఆ సభ నిర్వహణకు అయ్యే ఖర్చుల భారమంతా ప్రజలపైన పడుతుంది. కావున దేశంలోని మేధావివర్గం ఈ అంశంపై చర్చగావించి శాసనమండలి యొక్క ప్రాధాన్యతను పెంచాలి. లేదా అన్నిరాష్ట్రాలలో కేవలం ఒక శాసనసభచే కార్యకలాపాలు కొనసాగిస్తూ,ప్రజలపై ఖర్చు భారాన్ని తగ్గించడానికి పూనుకోవాలి అని ఆశిద్దాం.

-డా. పోలం సైదులు