దివ్యాంగులకు దిక్కెవరు ?

349
Who cares for the disabled

సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా మనుగడకోసం అష్టకష్టాలు పడుతున్న తరుణంలో దివ్యాంగుల పరిస్థితి గురించి ఎలా ఉంటుందో అంచనావేయవచ్చు. వైకల్యం అనేది ఎక్కువగా పుట్టుకతోనే సంభవిస్తే, ప్రమాదాల బారినపడి కొంతమంది దివ్యాంగులుగా మారుతున్నారు. అంతేగాని వారు చేసిన తప్పేమీ లేకపోయినా సమాజంలో వివక్షతకు గురికాకతప్పడంలేదు. అంతెందుకు వారి కుటుంబంలోనే ఒకే రక్తం పంచుకున్న… కొన్నిసార్లు కుటుంబసభ్యులు సహనం కోల్పోయి ఈసడింపులకు పాల్పడి వారిని మానసిక క్షోభకు గురిచేస్తుంటారు.

ఇదిలాగా ఉంటే గ్రామాలలో దివ్యాంగులను వారిపేరుపెట్టి పిలువకుండా వైకల్యం పేరుతో సంబోధించి అవహేళన చేయడం చాలా దురదృష్టకరం. దివ్యాంగులకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికంటే ఎక్కువ మనోధైర్యం, పట్టుదల కలిగిఉంటారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉండి,ఏదైనా అనారోగ్యం బారినపడి,చేతగాని సమయంలో ఒకరిపై ఆధారపడే క్రమంలో అనుభవించే తీరు, జీవితాంతం అలాగే కొనసాగితే పరిస్థితిని తలుచుకుంటేనే భయపడే సందర్భాన్ని చూడవచ్చు. కావున ప్రతిఒక్కరు దివ్యాంగులపై కనబర్చాలిన ప్రేమ ఎలాఉండాలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

1955లో ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం జరపాలని తీర్మానించి, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ, సహానుభూతితోపాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక దృక్కోణం నుండి దివ్యాంగుల హక్కులు, గౌరవం, భద్రత, సంక్షేమం పట్ల అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. అంటే వారిసమస్య తీవ్రత ఏమేరలో ఉంటుందో అర్థంకాకమానదు. అందుకే దేశంలో మొదటగా 1995లో కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చట్టాన్ని తయారుచేసి 7 రకాల వికలాంగులకు సమానవకాశాలు, హక్కుల పరిరక్షణ, సమాజ భాగస్వామ్యం కల్పిస్తూ, రక్షణ, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించారు. కానీ అనుకున్నరీతిలో అమలుకు నోచుకోలేదని చెప్పవచ్చు.

2011 జనాభా లెక్కలప్రకారం దేశంలో 2.21 శాతం దివ్యాంగులు ఉంటే, వారిలో 20.3 శాతం కదిలిక లోపం, 18.9 శాతం వినికిడి లోపం, 18.8 శాపం చూపు లోపంతో బాధపడుతున్నారు. 2015-16 వికలాంగుల సాధికార విభాగం వెల్లడించిన నివేదికప్రకారం 49.5 శాతం దివ్యాంగులు ఎలాంటి పథకాల లబ్ది పొందలేకపోతున్నారని వెల్లడించింది. వీటి ఫలితంగానే పరిణామంలోగల మార్పులానుసారంగా కేంద్రప్రభుత్వం 1995 వికలాంగుల చట్టాన్ని సవరిస్తూ, దివ్యాంగుల బిల్లు – 2016ను పార్లమెంటులో మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగింది.

2016లో గావించిన చట్టంప్రకారం 21రకాల వైకల్యాలశ్రేణి

  1. అంధత్వం
  2. దృష్టిలోపం
  3. కుష్టు
  4. వినికిడి లోపం
  5. చలన వైకల్యం
  6. మరుగుజ్జుతనం
  7. బుద్ధిహీనత
  8. మానసిక సమస్యలు
  9. ఆటిజం
  10. సెరిబ్రల్ పాల్సీ
  11. మస్కులర్ డిసోపి
  12. నాడీ సంబంధ సమస్యలు
  13. స్పెసిఫిక్ లెర్కింగ్ డిజెబిలిటీ
  14. మల్టిఫుల్ స్లేరోసిస్
  15. మాట్లాడలేకపోవడం
  16. తలసేమియా
  17. హీమోఫీలియా
  18. సిడిల్ సెల్ డిసీజ్
  19. మల్టిఫుల్ డిజెబిలిటీస్
  20. యాసిడ్ దాడి
  21. పార్కిన్సన్స్

ఇన్నిరకాల లోపాలకు ఈచట్టం వర్తిస్తుంది. దీనిలో దివ్యాంగులయిన చిన్నారులకు ఉచిత నిర్బంధవిద్య హక్కు కల్పించాలి. అలాగే దివ్యాంగులపై వివక్షత చూపితే జైలుశిక్ష లేదా జరిమానా లేదా తీవ్రతనుబట్టి రెండు విధించవచ్చు. అదికూడా 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు 10 వేల నుండి 5 లక్షల వరకు జరిమానా విధించే విధంగా చట్టాన్ని తీసుకువచ్చారు.

ఈచట్టాన్ని యావత్ ప్రజానీకం హర్షించే విధంగాఉన్నా, అమలును నిష్పక్షపాతంగా తప్పనిసరిచేస్తే మేలుజరుగుతుంది. కానీ గతంలోనే చట్టాలవలె కొనసాగిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను మాత్రంచేసి, ఏవేవో మార్గదర్శకాలను చూపుతూ, మభ్యపెట్టే ప్రయత్నంచేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఎప్పుడైతే ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించి, అందరికీ అవగాహన కల్పిస్తూ, క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనాఉన్నది.

వైకల్య ధ్రువీకరణ విధానంలో కట్టుదిట్టమైన యంత్రంగాని తయారుచేసి, నిస్పక్షపాతంగా కొనసాగించాలి. అంతేగాని అవినీతికి పాల్పడి చట్టాల ముసుగులో ఫలాలను అందిపుచ్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిన అసలైన దివ్యాంగులు నష్టపోయే ప్రమాదముంటుంది. కావున ఆధార్ కార్డుతో అనుసంధానంచేసి నకిలీబెడద లేకుండా అవినీతినిర్మూలనకు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనాఉన్నది. ఒక్కొక్క విభాగానికి ఒకప్రత్యేక సంస్థను ఏర్పాటుచేసి, యంత్రంగాన్ని నియమించినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. దివ్యాంగులను ఉమ్మడిశాఖ నుండి విడదీసి వారిసంక్షేమం, అభివృద్ధికై ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఏర్పరిచి,తగినంత సిబ్బంది, తదితర ఏర్పాట్లను చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

రాష్ట్రప్రభుత్వం సైతం జిఓ నెంబర్ 30 ప్రకారం వివిధసంస్థలలో దివ్యాంగులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ఆత్మగౌరవంతో మనుగడసాగించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలుచేస్తున్న దివ్యాంగులకు, విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి మానసికసంఘర్షణ నుండి బయటపడేయాలి. అలాగే విద్య, వైద్యం,ఉద్యోగ ఇతరరంగాలలో తగినంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంసైతం ఎంతైనాఉన్నది. వారు సాధారణ మనుషులవలె నిమడలేరు కావున విద్యార్థులకు ఎక్కువసంఖ్యలో విద్యాసంస్థలను ఏర్పాటుచేసి, వారికి జీవితంపట్ల భరోసానివ్వాల్సిన అవసరం ఉన్నది. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ ఒకేవిధంగా చూడాల్సిన అవశ్యకత ఉన్నది.

గ్రామాలలో, పల్లెలలో ఎక్కువగా వివక్షత ఉంటుందనడంలో ఎలాంటి అవాస్తవంలేదు. వారిని లోపంపేరుతో ఈసడింపులకు గురిచేస్తూ,హేళన చేయడమేకాకుండా వారికనుకూల సౌకర్యాలలేమితో విద్యకు దూరంచేయడం సర్వసాధారణమైంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే చట్టాలపై కనీసం అవగాహన లేకుండాపోతుంది. కావున మండలస్థాయిలో సమావేశపరిచి చైతన్యం గావించి వారిహక్కులను తెలియజేస్తూ, యావత్తు సమాజం వారివెనుక ఉందని తెలియజేస్తూ, మనోధైర్యాన్ని కలిగించాల్సిన అవసరం సైతం ఎంతైనాఉన్నది.

దివ్యాంగులను గ్రామాలలో గుర్తించి, అధికారులే వారివద్దకువచ్చి ధ్రువీకరణ గావించడానికి తగినఏర్పాట్లుచేసి వారిఉన్నతికి పాల్పడే యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. దివ్యాంగులకు చెందిన ఎందరో మహానుభావులు ఎన్నో నూతన ఆవిష్కరణలు గావించి,చరిత్ర పుటలలో తమపేరును శాశ్వతంగా లిఖించుకున్న విధానాన్ని వారికి తెలియజేసి ఉత్తేజితులను చేయాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లు సమాజంలో రాజకీయ అధికారం మాస్టర్ కి లాంటిది. అందుకే పాలనలోసైతం వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి, అవిటితనం కేవలం శరీరానికేగానీ, మేధస్సుకుకాదని రుజువుచేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. “అడగనిది అమ్మయినా అన్నంపెట్టదు” అంటారు. కావున దివ్యాంగుల అంత సంఘటితమై తమహక్కులను సాధించుకోవడానికి పూనుకోవాలి. అలాగే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వారికోసంచేసే చట్టాలు కేవలం పేపర్లలో అక్షరాలకే పరిమితం చేయకుండా,క్షేత్రస్థాయిలో అమలుపరుస్తూ ప్రత్యేకచర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైననే ఉన్నది.

సమాజ మనుగడలో ఎవ్వరు శాశ్వతంకాదు. అలాగే అందరూసమానులే. మనుషుల మధ్య వ్యత్యాసాలు, వివక్షత లేకుండా సమసమాజ నిర్మాణంకోసం అందరికీ భాగస్వామ్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. కావున ప్రత్యేకంగా దారిద్రరేఖకు దిగువనున్న పేదప్రజలను, దివ్యాంగులను అభివృద్ధిపథంలో నడిపించే విధానం కొనసాగాలి. మరీముఖ్యంగా అధికారవర్గం వాళ్ల ఆజమాయిషీ,పెత్తనమంతా పేదవర్గాలపై చూపుతూ, వారిని “కూరలో కరివేపాకు వలే” భావిస్తుంటారు. అది సరైనపద్ధతి కాదు, కేవలం జవాబుదారితనంతో సేవలందించడానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గుర్తుచేసుకుంటూ విధులు నిర్వర్తించాలి.ఏదిఏమైనా అందరికీ మేలు జరగాలని ఆకాంక్షిద్దాం.

– డా.పోలం సైదులు