సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్-2021లో రామ్ చరణ్…!

351
ram-charan-at-Cyberabad-police-annual-sports-meet

సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2021 ముగింపు వేడుకలు నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ముఖ్య అతిథి సినీ నటుడురామ్ చరణ్, గౌరవ అతిథి అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపూరి రమేశ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎం.ఎం. కీరవాణి, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి, డిసిపి ట్రాఫిక్ ఎస్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, బాలనగర్ డిసిపి పద్మజా, విమన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సెల్ డిసిపి అనసూయ, ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్పా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ.. సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2021లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులు, కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాల రక్షణకు ముందు వరసలో నిల్చున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ తెలంగాణ పోలీసులకు సెల్యూట్ చేశారు.

పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసిన సైబరాబాద్ సిపి, డైనమిక్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ ని ఆయన అభినందించారు.

అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపూరి రమేశ్ మాట్లాడుతూ ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ప్రతీ సంవత్సరం జరపాలన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు.

అడిగిన వెంటనే సిబ్బందిని ఇచ్చి సహకరిస్తున్న ఏఆర్ సిబ్బందిని, మొబిలైజ్/ సమీకరించిన ఏడీసీపీ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మాణిక్ రాజ్ కు అభినందనలు తెలిపారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2021 ముగింపు కార్యక్రమానికి పిలవగానే రామ్ చరణ్, గౌరవ అతిథి అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపూరి రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్లు కీరవాణి, అనూప్ రూబెన్స్ రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్లాస్మా డొనేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చిన సినీ నటుడు చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు.

సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ జనవరీ ౩౦వ తేదీన ప్రారంబమై నాలుగు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఈ క్రీడల్లో 7 టీమ్ లు మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్, శంషాబాద్ జోన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, క్రైమ్ వింగ్, ట్రాఫిక్ వింగ్, మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు.

క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర పోటీలు నిర్వహించామన్నారు. తరువాత చీఫ్ గెస్ట్ లు గౌరవ వందనాన్ని స్వీకరించగా, క్రీడల్లో గెలిచిన వారికి రామ్ చరణ్, అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపూరి రమేశ్,సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బహుమతులు అందజేశారు.

అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్… రామ్ చరణ్, అథ్లెటిక్స్ నేషనల్ కోచ్ నాగపూరి రమేశ్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, ఎం.ఎం. కీరవాణిలకు మెమొంటోను అందజేశారు.