రాజీవ్ కనకాల తల్లి మృతి

339
rajeev-kanakala-mother-passes-away

నాటక రంగ ప్రముఖురాలు, నటుడు రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహం లో తుది శ్వాస విడిచారు. దీంతో కనకాల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే.
కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది.
ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు.

11ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి గారు నాట్యకారిణిగా, నటిగా తెలుగు సినీ పరిశ్రమలో పనిచేశారు. మొదట్లో మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో పలువురికి ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. ఆ తరువాత సొంత ఫిలిం ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పి పలువురికి శిక్షణను ఇచ్చింది. సుహాసిని, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లు కూడా ఆమె దగ్గర శిక్షణ పొందిన వాళ్లే.

ఇక తెలుగులో ప్రేమ బంధంలో జయప్రదకు తల్లిగా ఆమె నటించారు. ఆపై ఒకఊరికథ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్నపాత్రలో నటించారు. పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్‌ తల్లి పాత్రలో నటించారు.

1971లో నటుడు దేవదాస్‌ కనకాలను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమెకు ఓ కొడుకు (రాజీవ్‌ కనకాల), కుమార్తె(శ్రీలక్ష్మి) ఉన్నారు. కోడలు కనకాల సుమ యాంకర్‌గా పాపులర్‌. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగ ప్రముఖులు.

ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.