మహిళలకు ఉచిత ప్రయాణం

345

టిక్కెట్ టిక్కెట్ అని అడ‌గాల్సిన ప‌నిలేదు. టిక్కెట్ లేని ప్ర‌యాణం నేరం అందుకు రూ.500 జ‌రిమానా అని బ‌స్సుల్లో రాసిన దాన్ని చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

ఎందుకంటే మ‌హిళ‌ల‌కు ఉచితం. ఇది ఎక్క‌డ? అన్న అనుమానం వ‌చ్చింది క‌దా. తెలంగాణ‌లో మాత్రం కాదు.

పంజాబ్ ప్రభుత్వం మ‌హిళ‌ల‌కు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణాలకు అనుమతించింది. అయితే ఇది మహిళలకు మాత్రమే.

మిగిలినవారు యధాతథంగా డబ్బు చెల్లించాల్సిందే. రాష్ట్రంలో ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా మహిళలు బస్సుల్లో ఉచితంగా వెళ్లవచ్చని ప్రకటించింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నూతన విధానానికి పంజాబ్ ప్ర‌భుత్వం తెర‌లేపింది.

ఎక్క‌డికైనా ఉచితంగా వెళ్లొచ్చు

ప్రభుత్వ బస్సుల్లో ఆ రాష్ట్రంలోని ప్రఖ్యాత ప్రదేశాలు, కట్టడాలు, అందమైన పొలాల గుండా ఎక్కడికైనా సులభంగా ప్రయాణించే సౌలభ్యాన్నిచ్చింది.

పంజాబ్ అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు.

ఇది పంజాబ్‌లోని వేలాది మంది మహిళల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆయన అన్నారు.

“అన్ని ప్రభుత్వ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.

ఆడవారిని శక్తిమంతం చేసే ప్రయత్నాల్లో మేము పట్టుదలగా ఉన్నాం. మహిళల సాధికారితే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది.

ఇకముందు కూడా ఇలాంటి విధానాలే కొనసాగిస్తాం. అందరికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ” అని అమరీందర్ సింగ్ అన్నారు.

మ‌హిళ‌ల‌కు ప్రత్యేక హాస్టళ్లు

ఉచిత ప్రయాణం మాత్ర‌మే కాకుండా మహిళల సాధికారిత సాధించేందుకు పంజాబ్ ప్రభుత్వం 8 కొత్త పథకాలను ప్రవేశపెట్టనుంది.

2047 మంది మహిళా ఉపాధ్యాయులకు నియామక లేఖలను జారీ చేయనుంది. అంతేకాకుండా 181 సాంజ్ శక్తి హెల్ప్ లైన్లు, పోలీస్ హెల్ప్ డెస్కులను ప్రారంభించనుంది.

పాటియాలా, జలంధర్, లుథియానా, మొహలీ, బటిండా, మాన్సా లాంటి పట్టణాల్లో పనిచేసే మహిళలకు ఏడు ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది.

ఎవరైనా పంజాబ్‌ను సందర్శించాలనుకుంటే వారి కోసం ఇక్కడ వర్చువల్ టూర్ ఆప్షన్ ఉంది.

ఇలాంటి వినూత్న విధానాలు దేశంలో ఇతర ప్రదేశాల్లోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.

మైసూరులో ఓపెన్ రూఫ్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

కశ్మీర్లో భారత సైన్యం పాత బస్టాండును పిల్లలకు కోసం వీధి గ్రంథాలయం (స్ట్రీట్ లైబ్రరీ)గా మార్చింది.

ఇప్పుడు పంజాబ్ ప్ర‌భుత్వం మహిళల కోసం రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణాలను ప్రారంభించింది.