కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్

380
Pre-recruitment training

లక్ష్యాన్ని చేరాలన్న తపనకు తోడ్పాటు తోడైతే.. గెలుపు తీరాలకు చేరడం మరింత సులువుతుంది. రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్.. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల్లో భరోసా నింపుతున్నది. గమ్యం వైపు అడుగులేయిస్తున్నది. ప్రైవేట్ కోచింగ్‌లో వేలకు వేలు ఫీజులు చెల్లించి శిక్షణ పొందలేని వారికి ఇది వరంలా మారింది. పరుగు, షాట్‌ఫుట్, లాంగ్ జంప్.. ఇలా వివిధ అంశాల్లో చక్కగా తర్ఫీదు పొందుతూ.. రాటుదేలుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత చక్కని చేయూతనందిస్తున్న సర్కారు, రాచకొండ పోలీసులకు జేజేలు పలుకుతున్నారు.

స్టడీ మెటీరియల్ సైతం..

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ క్యాంప్ ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నది. గతేడాది మీర్‌పేట, బాలాపూర్, పహాడీషరీఫ్, మహేశ్వరం, కందుకూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉన్న అభ్యుర్థులకు పహాడీషరీఫ్‌లో ఉచితంగా శిక్షణ ఏర్పాటు చేశారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో 116 మంది మహిళలకు, 338 పురుషులు మొత్తం 338 మంది అభ్యర్థులకు తర్ఫీదునిచ్చారు. రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్ అభ్యర్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేశారు. క్లాస్‌రూంలో శిక్షణ అనంతరం రిటన్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన 86 మహిళ, 162 మంది పురుషులు మొత్తం 248 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరందరికీ పహాడీషరీఫ్ కేంద్రంగా ఇస్తమా గ్రౌండ్‌లో రోజూ ఉదయం రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హై జంప్, షాట్‌పుట్ తదితర దేహదారుఢ్య శిక్షణను ఇన్‌స్ట్రక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో సి. గాయత్రి, ఆర్.ఝాన్సీ, కె. అరుణ్‌కుమార్, జి. గణేశ్, లోకేశ్‌కుమార్ మహిళా, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా తర్ఫీదునిస్తున్నారు. ప్రతి రోజూ పాలు, గుడ్డు, అరటిపండ్లు అందిస్తున్నారు. కోచ్‌ల ఆధ్వర్యంలో ఎంతో చక్కగా శిక్షణ పొందుతున్నామని, ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌కు, పోలీస్ ఉన్నతాధికారులకు, పీజేఆర్ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయులకు కృతజ్ఙతలు తెలుపుతున్నారు అభ్యర్థులు. పరీక్షల్లో విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.