
హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ) చిత్రంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయంపై సామాజిక కార్యకర్త దేవి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులకు వర్మపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రూపొందించిన ఈ చిత్రం విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు తీస్తూ సమాజాన్ని చెడగొడుతున్నారని దేవి విమర్శించారు. మహిళలను అభ్యంతరకరంగా చూపిస్తూ అంగడి సరుకుగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టాలను గౌరవించని వ్యక్తులకు ఈ దేశంలో నివసించే హక్కులేదన్నారు. మహిళలను కించపర్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
వర్మ పై సీసీఎస్ పోలీస్ లు ఐ టి యాక్ట్ 67, ఐ పి సి 506, 509 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసారు.
జీఎస్‌టీ పై అభ్యంతరం తెలిపిన మహిళలతో పోర్న్ సినిమా లు తీస్తానని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేసాడని అందుకే అతని పై కేసు పెట్టానని పోలీస్ లు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని సామజిక వేత్త దేవి తెలిపారు.