
పోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒకసారి ఘోరంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారి మరోసారి దెబ్బకొట్టింది.
కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వ్యాక్సిన్ వచ్చినా ఇంకా భయం తొలగలేదు. యావత్ ప్రపంచం కొవిడ్-19తో పోరాటం చేస్తూనే ఉంది.
కంటికి కనిపించని ఈ వైరస్ ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది.
ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు.
తాజాగా కరోనా వల్ల జరిగిన మరో అనర్థం వెలుగుచూసింది. కరోనా ప్రభావంతో మన దేశంలో ఏకంగా 10 వేలకుపైగా కంపెనీలు మూతపడ్డాయి.
గతేడాది(2020) ఏప్రిల్ నుంచి ఈ ఫిబ్రవరి(2021) వరకు దేశంలో 10 వేలకి పైగా (10వేల 113) కంపెనీలు స్వచ్ఛందంగా మూతపడ్డాయని ప్రభుత్వమే వెల్లడించింది.
కరోనా వైరస్, లాక్‌డౌన్ పరిణామాలతో ఆర్థికంగా దెబ్బతినడం ఇందుకు కారణం.. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది.
దీని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 2014 కంపెనీల చట్టంలోని సెక్షన్ 248 (2) కింద మొత్తం 10,113 కంపెనీలను మూసివేశారు.
చట్టపరమైన చర్యల వల్ల కాకుండా స్వచ్ఛందంగానే కంపెనీలు వ్యాపారాలను ఆపేశాయనే విషయాన్ని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఢిల్లీలో అత్యధికంగా 2,394 కంపెనీలు మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్ (1,936 కంపెనీలు) ఆ తర్వాతి స్థానంలో ఉంది.
తమిళనాడులో 1,322, మహారాష్ట్రలో 1,279, కర్ణాటకలో 836, చండీగఢ్‌లో 501, రాజస్థాన్‌లో 479 కంపెనీలు మూసేశారు.
తెలంగాణలో 404, కేరళలో 307, ఝార్ఖండ్‌లో 137, మధ్యప్రదేశ్‌లో 111, బిహార్‌లో 104 కంపెనీలు మూతపడ్డాయి.