సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ వేరు. ఇప్పటి తెలంగాణ వేరు.
జీవితాలను చక్కబెట్టుకోవాలని ఎంతో కష్టపడి సాధించుకున్న మన తెలంగాణ రాంగ్ రూట్‌లో వెళుతోంది.
తెలంగాణలో గన్ కల్చర్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నచిన్న విషయాలకే గన్‌లను బయటకు తీస్తూ బెదిరిస్తున్నారు.
నెల రోజుల కిందట ఓ టీనేజ్ యువకుడు గన్‌తో బెదిరించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరిచిపోకముందే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘటన చోటు చేసుకుంది.
ఓల్డ్ సిటీలో కాలాపత్తర్‌కు చెందిన హబీబ్ హష్మీ అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే ఇతను తన ఇంట్లోనే కాల్పులకు పాల్పడ్డాడు.
బిలాల్ నగర్‌లోని తన ఇంట్లో భార్యా ఇద్దరు పిల్లలపై హబీబ్ హష్మీ కాల్పులకు తెగబడ్డాడు. గత కొంతకాలంగా హబీబ్ చెడు వ్యసనాలతో తిరుగుతున్నాడు.
సోమవారం సాయంత్రం ఇంటి పేపర్లు ఇవ్వాలంటూ భార్య, కుమారుడితో గొడవ పడ్డాడు.
పేపర్లు ఇవ్వమంటూ చెప్పడంతో ఆగ్రహించిన హబీబ్ ఇంట్లోకి వెళ్లి లైసెన్స్ తుపాకీతో భార్య, కుమారుడిపై కాల్పులు జరిపాడు.
విచక్షణారహితంగా కుటుంబ సభ్యులపైకి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
అయితే బుల్లెట్లు గురి తప్పి గోడకు తగలడంతో వారికి ప్రమాదం తప్పింది. తృటిలో కాల్పుల నుంచి తప్పించుకున్న కుమారుడు ఉమర్ హష్మీ కాలాపత్తర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే స్పందించిన పోలీసులు హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
హబీబ్ హష్మీని అదుపులోకి తీసుకోవడంతో పాటు గన్‌ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సిటీ పరిధిలో మొత్తం 10 వేల మందికి పైగా గన్ లైసెన్స్ కలిగి ఉన్నారు.
లైసెన్సు పొందిన వారిలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు.
అయితే వీరిలో కొద్ది మంది ఆత్మరక్షణ కోసం కాకుండా ఎదుటి వారిని బెదిరించేందుకు తమ ఆయుధాలు ఉపయోగిస్తున్నారు.
బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమంగా నాటు తుపాకులు తెచ్చి సిటీలో యువతకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో చాప కింద నీరులా నగరంలో గన్ కల్చర్ విస్తరిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి.