వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదా..ఐతే మళ్ళీ పెళ్లి తప్పదు ?

321

వివాహ ధృవీకరణ పత్రం అవసరం ఉండి.. మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తిని అధికారులు అవమానించారు. ఈ సంఘటన కేరళలోని కోజికోడ్ జిల్లాలోని ముక్కోమ్ మ్యారేజ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద 2003, ఫిబ్రవరి 27వ తేదీన మధుసూదన్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన నాడు వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదు. గత నెల 19న మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం ఉండి.. రిజిస్ట్రార్ కార్యాలయానికి మధుసూదన్ వెళ్లాడు.

16 ఏళ్ల క్రితం నాటి రికార్డులు చూడలేక.. మళ్లీ పెళ్లి చేసుకుంటే మూడు రోజుల్లో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తామని అధికారులు మధుసూదన్‌కు చెప్పారు. దీంతో తనకు జరిగిన అవమానాన్ని మధుసూదన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ విషయం ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ మంత్రి సుధాకరన్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందిన అనంతరం.. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.