నోటి దురద ఒక్కోసారి లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది. దీంతో ప్రతి చిన్న విషయంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (అందరూ డిగ్గీ రాజా అని ముద్దుగా పిలుచుకుంటారు) ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.
ఎంఐఎం నేత అన్వర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో ఈ వారంట్ జారీ అయింది. 2016లో ఎంఐఎంపై దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల కేసును ఈ రోజు హైదరాబాద్ కోర్టు విచారణ జరిపింది.
ఎనిమిదవ అదనపు చీఫ్ మెట్రొపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ వారంట్ జారీ చేశారు. అయితే అనారోగ్యం కారణంగా విచారణకు రాలేనని.. మినహాయింపు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోర్టును కోరారు.
కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. కోర్టుకు హాజరుకానందుకు ఆయనకు నాల్ బెయిలబుల్ వారంట్‌ను కోర్టు జారీ చేస్తూ మార్చి 8వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.
డబ్బు సంపాదనే లక్ష్యంగా ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందన్న దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై అన్వర్ పరువు నష్టం దావా వేశారు.