
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్మసీ యువతి కిడ్నాప్, లైంగిక దాడి కేసు ఎన్నో మలుపులు తిరిగింది.
ఇంటి నుంచి వెళ్లిపోవడానికే యువతి కిడ్నాప్ నాటకం ఆడినట్లు పోలీసులు వెల్లడించారు.
యువతిపై అత్యాచారం జరగలేదని యువతి చెప్పిన విధంగా ఘటన జరిగినట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని యువతి నిర్ణయం తీసుకుందని తెలిపారు.
అసలు విషయాన్ని యువతి తల్లి పోలీసులకు చెప్పడంతో, భయపడి లైంగిక దాడి నాటకం ఆడినట్లు తెలిపారు.
ఈ కేసులో మొదట ఈ నెల 10న సాయంత్రం ఆరున్నరకు పోలీసులకు ఫోన్ వచ్చింది. తన కుమార్తెను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేశారని మహిళ కేసు నమోదుచేసింది.
యువతికి ఫోన్ చేసిన పోలీసులు ఆమె పంపిన లైవ్ లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ తీవ్ర స్థితిలో పడిఉన్న యువతిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.
అనంతరం పోలీసులు విచారించగా ఆటో డ్రైవర్ అపహరించి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించింది.
యువతి మాటల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సరైన ఆధారాలు దొరకలేదు.
శాస్త్రీయకోణంలో దర్యాప్తు చేయగా ఆటోడ్రైవర్లు ఎలాంటి తప్పు చేయలేదని తేలింది.
సీసీటీవీ ఫుటేజిలో కూడా ఆ అమ్మాయి పలు ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్టు వెల్లడైంది.
గతంలో ఓ ఆటో డ్రైవర్ పై ఉన్న కోపాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంది. తనను కిడ్నాప్ చేశాడని తల్లికి చెప్పింది.
దాంతో అది నిజమే అని నమ్మిన ఆ విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సీపీ వెల్లడించారు.