ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు చోటు లేదు – కెటిఆర్

224
no place for physical attacks in a democracy

ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, మా పార్టీ పైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉన్నది అని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఈరోజు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదు అని అన్నారు.

గతంలోనూ బిజెపి భౌతిక దాడులకు ప్రయత్నించింది. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి, భౌతిక దాడులకు బిజెపి పదే పదే దిగడం తెలంగాణ రాజకీయాలకు ఏ మాత్రం వాంఛనీయం కాదు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి అని హెచ్చరించారు.

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఓపిక నశిస్తే, బిజెపి కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, బిజెపి భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మా ఓపిక కి ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బిజెపిని హెచ్చరించాం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం అని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బిజెపి మర్చిపోకూడదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బిజెపిని ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.