రోడ్డు ప్రమాదాలను అరికట్టేదెలా ?

230
How to prevent road accidents?

రాష్ట్రంలో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట రహదారులపై ఎందరో ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులుకావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్న ప్రమాదాలు, మృతులసంఖ్య తగ్గడంలేదు. అతివేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యంవల్ల వేలాదిమంది బ్రతుకులు గాలిలో కలిసిపోతున్నాయి. రోడ్డుప్రమాదాల్లో ఎక్కువగా మలుపులవద్ద జరుగుతున్నాయి. ఇరుకురోడ్లు, వంతెనలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి ప్రమాదాలనివారణకు అధికారులు చర్యలు చేపట్టిన ఆశించిన మార్పు కనిపించడంలేదు.

ముఖ్యంగా హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ప్రమాదాలసంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. 2019లో రోడ్డుప్రమాదాలవల్ల 6,964 మంది మృతిచెందగా, 21,999 మంది గాయపడ్డారు. 2020 జూన్ 30 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8,712 రోడ్డుప్రమాదాలు జరగగా 2,595 మంది మృతిచెందితే 9,173 మంది గాయపడ్డారు. ఈఏడాది రాష్ట్రంలో కరోనా మృతులకంటే ప్రమాదపు మృతులే ఎక్కువగా ఉన్నాయి అంటే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాలు భారీగాతగ్గాయి. జనవరి నుంచి జూన్ వరకు దేశంలో 35శాతం రోడ్డుప్రమాదాలు తగ్గినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. 2019 తొలి ఆర్నెలల్లో మృతులసంఖ్య 79,678  నమోదుకాగా, 2020  తొలి ఆర్నెలల్లో 56,288  మంది మృతిచెందారు.

ఈమధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్తలేకుండా పత్రికలేదంటే అతిశయోక్తిలేదు. ప్రతిరోజు ఏదో ఒకచోట ప్రమాదాలుజరిగి ప్రాణాలను కోల్పోవడం ప్రతిఒక్కరు చూస్తూనే ఉంటారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఏదైనా ఒకకుటుంబంలో ఎవరైనా ఇలాంటి ప్రమాదాల బారినపడి మరణిస్తే ఆకుటుంబం అంతా మానసికంగా,ఆర్థికంగా వెనుకబడి రోడ్డునపడాల్సిన అంత పనవుతుంది. రెప్పపాటు వ్యవధిలో జరిగే ఇలాంటి ప్రమాదాల గురించి సమగ్రంగా అధ్యయనం చేసి, విశ్లేషించి దానికిగల కారణాలను కనుక్కొని అరికట్టడానికిగల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది. అలాగే వాహనదారులు సైతం ఎంతో జాగ్రత్తవహించాల్సిన అవసరం ఉన్నది.

ప్రస్తుతం సమాజంలో ప్రతికుటుంబంలో ఏదోఒక వాహనం లేకుండా ఉండలేని పరిస్థితి. గతంలో సైకిళ్లమాదిరిగా ఆర్థికస్తోమతకనుగుణంగా ద్విచక్రవాహనాలు వాడటం జరుగుతుంది. అదికూడా ఒక నిత్యావసర వస్తువుగా మారిందని చెప్పవచ్చు. ఆర్థికంగా కొంతమెరుగ్గా ఉన్నవారి ఇంట్లో ఎంతమంది యువకులు ఉంటే అన్నివాహనాలు.అలాగే పట్టణాలు,నగరాలలో ఉన్న ధనవంతులఇళ్లలో ఎలాంటి వాహనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మారుతున్న కాలానికనుగుణంగా, ఎవరికివారు వారి పనులనిమిత్తం పలురకాల వాహనాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాగే గతంతో పోలిస్తే రహదారులుసైతం పెద్దవై వేగాన్ని నిరోధించకుండా మారి, నడుపుతున్న సమయంలో ఒక్కక్షణం అజాగ్రత్త వహించిన ప్రమాదాల బారినపడక తప్పనిపరిస్థితి నెలకొంది.

రోడ్డు ప్రమాదాలనేవి చాలారకాలుగా జరుగుతున్నాయి. అజాగ్రత్త వహించడం,మద్యంమత్తులో వాహనాలు నడపడం,అతివేగం వలన,శీతాకాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడకపోవడం, తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డురావడం, రోడ్డుభద్రత విద్యకు సంబంధించిన జ్ఞానంలేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడంలాంటి కారణాలవలన ప్రమాదాలు జరిగితే, ఒక్కొక్కసారి ఎదుటివాహనం అజాగ్రత్త కారణంగా ప్రమాదాలబారినపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సైతం జరగడం అందరికీ తెలిసిందే.

మనరాష్ట్రంలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల కుమారులు మరియు రాజకీయ నాయకుల పుత్ర సంతానం రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు ఎంతో చర్చజరిగి, త్వరలోనే ప్రమాదాన్ని అరికట్టే చర్యలను తెలిపేవారు. కానీ ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు మళ్ళిజరుగుతూనే ఉన్నాయి .సెలబ్రిటీ కుటుంబాలకు చెందని వారెందరో ప్రమాదాలకు గురవుతున్న మనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే వారికంతా ప్రాధాన్యత సంతరించుకోదు. ఏదిఏమైనా ప్రాణంవిలువ వెలకట్టలేనిది. తల్లిదండ్రుల పుత్రశోకాన్ని ఎవరు తగ్గించలేరు. వారికుటుంబ లోటును ఎవరుపూడ్చలేరు.

ఉదయం ఇంటినుండి బయలుదేరామా ? సాయంకాలం ఇంటికెళ్ళేదాకా మనిషి జీవితానికి భద్రతా లేకుండా పోయింది. రోడ్డుప్రమాదంలో ఒక్కొక్కసారి ఎంతజాగ్రత్తగా వ్యవహరించిన మృత్యువు ఏసమయంలో ఎలావస్తుందో తెలియనిపరిస్థితి, కేవలం వాహనాదారులే ప్రమాదాలకు గురి గాకుండా ఒక్కొక్కసారి అమాయక పాదాచారుల ప్రాణాలు వాహనాలకు బలైపోవడం చూస్తుంటాము.

ముగ్గురు ఎక్కే ఆటోలో పదిమందిని ఎక్కించడం, ఇద్దరెక్కే మోటార్ సైకిలుపై ఐదారుగురు ఎక్కడం, హెల్మెంట్స్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రోడ్డుభద్రత నియమాలు పాటించకపోవడం, త్రాగి వాహనం నడపడం, మొబైల్ లలో మాట్లాడుతూ వాహనం నడపడం,అస్తవ్యస్తమైన రోడ్లు, ఇలాంటి సందర్బాలలో ప్రమాదాలకు గురికావాల్సి వస్తుంది.

రోడ్డుప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసి పోతుండటంలో గల అంశాలను పరిశీలిస్తే..

  • ప్రమాదాలు ఎక్కువగా విశాలమైన నాలుగు మార్గాలరోడ్డు,ఔటర్ రింగు రోడ్డులపై ఎక్కువగా జరుగుతుంటాయి. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని పురస్కరించుకోని శాస్త్రవేత్తలు ఎన్నో రకాలైన వాహనాలు కనిపెడుతూ, తయారుచేస్తుంటారు. లక్షలు లక్షలుపెట్టి వాహనాలు తీసుకోని నిధానంగా వెళ్లకుండా అతివేగంతో వెళ్లి, రెప్పపాటు క్షణంలో నియంత్రణ కోల్పోయి, ఏం జరుగుతుందో అని ఆలోచించకముందే ప్రాణాలను కోల్పోయే ప్రమాదాలు జరుగుతున్నాయి.
  • ప్రమాదాలు జరగడంలో అతివేగం ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నదో మద్యంకూడా అంతే ప్రాధాన్యత కలిగివున్నది. ఇంకొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ విచక్షణజ్ఞానాన్ని కోల్పోయి ప్రమాదాలబారిన పడుతుంటారు.
  • కొన్నిసర్వేలను పరిశీలిస్తే ప్రమాదాలలో ప్రాణాలను కోల్పోయినవారిలో అత్యధికం యువతే ఉండటం బాధాకరం. తల్లిదండ్రులు పిల్లలను గారాభంగాపెంచి, అడిగిందల్లా ఇప్పించడం, వారికీ అడిగినంతసొమ్ము ఇవ్వడం, వారు వివిధ చెడువ్యసనాలకు అలవాటుపడటం, ఎవ్వరికి భయపడకుండా మొండిగా తయారుకావడం లాంటివి చూస్తుంటే వారే తమప్రాణాలకు ముప్పును ‘కొని’ తెచ్చుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
  • ఫోన్లల్లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడంవలన కూడా ఎన్నోప్రమాదాలు జరుగుతున్నాయని ఎన్నోసర్వేలు సెలవిచ్చాయి.నేటి ఆధునికయుగంలో అభివృద్ధి చెందుతున్న శాస్త్ర, సాంకేతికరంగంను ఉపయోగించుకుంటూ ప్రపంచంలో ఏమూలాన ఏం జరిగిన క్షణంలో తెలిసిపోతుంది. నగరాలల్లో కూడళ్ల వద్ద, ఘాట్స్ రోడ్స్ వద్ద ఫోన్లలల్లో సంభాషించుకుంటూ ప్రమాదానికిగురై ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లలో రికార్డుకావడం మనం గమనిస్తూనే ఉంటాం.
  • కార్లలల్లో అతివేగంగా గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణించడం, సీటుబెల్టు పెట్టుకోకపోవడం, ఆ సమయంలో సేఫ్టీ ఫీచర్స్ పనిచేయకపోవడం లాంటివి రహదారిని రక్త సికంగా మారుస్తుంటాయి. కొన్నిసంధర్భాలల్లో అతివేగంగా ప్రయాణించేటప్పుడు ఆకస్మికంగా గుండే పోటు, రక్తపోటులాంటివి వచ్చిన, ఏమైనా మానసికపరమైన ఆందోళనలతో వాహనాలను నడుపుతున్న సందర్భంలో ఇలాంటి ప్రమాదాలు జరిగే ఆస్కారముంటుంది.
  • బైకులపై ఎక్కువమంది ప్రయాణించడం, హెల్మెట్ ధరించకపోవడమనేది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సులభంగా ప్రాణంపోవడానికి దోహదపడుతుంది. ప్రత్యేకంగా రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపైననే జరుగుతుంటాయి. అస్తవ్యస్తమైన రోడ్లవల్లకావొచ్చు, ఘాట్ రోడ్డులు ఎక్కువగా ఉండటం, అదేవిదంగా అతివేగం, రహదారులు వంకరటింకరగా వుంటూ ఎలాంటి ప్రమాదనివారణ బోర్డులు లేకపోవడంవలన కూడా ఇలాంటి ప్రమాదాలుజరిగే అవకాశమున్నది.
  • రోడ్డుభద్రత అధికారులు సరిగ్గా సరైనసమయంలో సక్రమంగా స్పదించకపోవడం, వారికీసైతం ప్రభుత్వం సహకరించకపోవడం మూలంగా ప్రమాదాలు జరుగుతుంటాయి.

ప్రమాదాలను అరికట్టడానికి చేయవల్సిన కార్యక్రమాలు :

  • ప్రభుత్వం ప్రమాదాల నివారణకు కఠినమైన చట్టాలను వినియోగించాలి.
  • డ్రైవర్లకు లైసెన్సు జారీచేసేటప్పుడు ప్రభుత్వం అమలుపరిచే చట్టాలపై అవగాహన కల్పించాలి.వారందరికీ సూచనలిస్తూ , చట్టాలను అతిక్రమిస్తే జరిగేనష్టాన్ని ముందుగానే తెలియజేయాలి.
  • రోడ్డుభద్రత అధికారులు రోడ్లను జాగ్రత్తగా పరిశీలిస్తూ,ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తుండాలి.ప్రధాన కూడలివద్ద జీబ్రాక్రాసింగ్,ట్రాపిక్ సిగ్నల్స్ ఉంచుతూ సక్రమంగా పనిచేసేలా చూస్తుండాలి.
  • బైకులపై ప్రయాణించే వారికీ హెల్మెట్ వాడకం తప్పనిసరిగా చేయాలి.ఇక్కడ ట్రాపిక్ పోలీసులు అధికార దుర్వినియోగం చేయకుండా అందరిని సమానంగా చూస్తూ, చట్టాలను కఠినంగా అమలుపరుస్తుండాలి.
  • కార్లలల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోని ,మితిమీరిన వేగంతో వెళ్ళవద్దు.తమకంటూ కుటుంబం ఉంటుందని ,తమకేమన్నైతే వారువీధుల్లో పడతారనే ధోరణితో ఆలోచించాలి.
  • మద్యం సేవించి,ఫోన్లో మాట్లాడుతూ,సరైన నిద్రలేకుండా,అలసటతో,మానసిక ఆందోళనలతో వాహనాలను నడపడంవల్ల ప్రమాదంజరిగే అవకాశమున్నది.కావున వీటిని విడనాడి వాహనం నడపడం మంచిది.
  • జాతీయ రహదారులపై ప్రమాద హెచ్చరిక బోర్డులను అమర్చాలి.ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తనిఖీలు నిర్వర్తిస్తూ, తగినచర్యలు తీసుకుంటుండాలి.వంకర రోడ్లవద్ద ,ఘాట్రోడ్ల వద్ద వేగనియంత్రణను, మలుపులను సూచించే బోర్డులను అమర్చాలి.
  • జాతీయ రహదారులున్నచోట గ్రామాలున్నట్లయితే ప్రత్యేకంగా లింక్ రోడ్లు ఏర్పాటుచేయాలి. గ్రామానివాసులకు, ప్రమాదపు బారినపడకుండా తగిన సూచనలిచ్చే యంత్రాంగాన్ని ప్రభుత్వం చేపట్టాలి.
  • విద్యార్థులకు 8వ తరగతి నుండి డిగ్రీ వరకు రోడ్డుభద్రతకు సంబందించిన అన్నీవిషయాలను తెలిసేవిదంగా ప్రత్యేక పాఠాలను ప్రవేశపెట్టాలి. ప్రమాదానికిగురై బజారున పడినకుటుంబాలను, కుంటుబడిన ఆర్థికస్తోమతను, మానసికవేధన తెలిసేవిదంగా కొన్ని వ్యక్తిగత అంశాలను క్రోడీకరించి, అమర్చి, ప్రవేశపెట్టాలి.
  • జాతీయ రహదారులవెంట, ప్రత్యేక అంబులెన్స్, పర్యవేక్షణకై ప్రత్యేక యంత్రాంగాన్ని అమలుచేసి, తప్పుచేసిన వారిపై కఠినచర్యలు ఉండేవిదంగా చట్టాలను తయారుచేస్తే భవిష్యత్ తరాలను కాపాడిన వాళ్లమవుతాం.
  • మద్యం సేవించి వాహనంనడిపిన,నిర్లక్ష్య వైఖరి అవలంభించిన వారికీ ఒకటికి రెండు అవకాశాలిచ్చి వారి లైసెన్స్ ను రద్దుచేసేవిదంగా చర్యలు తీసుకోవాలి.
  • నగరాలలో రద్దీగున్న కూడలిలవద్ద ట్రాపిక్ వ్యవస్థను కఠినంగా అమలుపరిచే చట్టాలుండాలి.
  • జాతీయ రహదారుల పరిధిలోమద్యం షాపులు లేనివిదంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రమాదాల నివారణకోసం జాతీయ,రాష్ట్ర రహదారులపై సుమారు 50 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సూచన మేరకు అధికారులు గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. తర్వాత 70 పోలీస్ స్టేషన్ల ఆవశ్యకతను గుర్తించారు. అందుకవసరమైన వాహనాల కొనుగోలు. లేజర్ గన్స్, స్పీడ్ గన్స్, బ్రీత్ ఎనలైజర్, ఫస్ట్ ఎయిడ్ వైద్యం తదితర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ  ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడం దురదృష్టకరం.

రహదారులపై 22 రీజనల్ కార్యాలయాలు ఏర్పాటుచేయాలని ఇటీవల రోడ్డుభద్రత విభాగం అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి 1800 కిలోమీటర్లకు ఒక డివిజన్ కార్యాలయం, 900 కిలోమీటర్లకు ఒకగ్రూపు కార్యాలయం, 600  కిలోమీటర్ల పరిధిలో సబ్ గ్రూపు కార్యాలయం, ప్రతి 300 కిలోమీటర్ల దూరంలో ఫీల్డ్ ఆఫీసర్ వుండేలా ఇదివరకే ప్రతిపాదనలు సిద్ధంచేశారు.కానీ అవి ఎప్పుడూ అమలులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందనడంలో నిజంలేకపోలేదు.

రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో ప్రమాదపు స్పాట్ లను గుర్తించారు. అక్కడ ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవడం, సిబ్బందితో తనిఖీలు చేయించడం ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటే కొంతమేర ప్రమాదాలను తగ్గించడానికి వీలవుతుంది.

ఇలాంటి ప్రమాదాల విషయంలో ఒక ప్రభుత్వం మాత్రమే కాకుండా వాహనదారులు సైతం పరస్పరం సమష్టిగా సహకరించుకుంటూ తదనుగుణంగా చర్యలుచేపడితే ప్రమాదాలను అరికట్టడానికి వీలుకలుగుతుంది. కావున ఆదిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.

డా.పోలం సైదులు