టి ఆర్ ఎస్ లో కలిపేద్దాం : మోత్కుపల్లి సంచలన వ్యాఖ్య

273
mothkupalli-narsimhulu-sensational-comments-ntr-death-anniversary

తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయి పతనమైందనే చెడ్డ పేరు కంటే టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని మోత్కుపల్లి చంద్రబాబు కు సూచించారు. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయాలను అర్థం చేసుకోవాలని, చంద్రబాబుకు నేనిచ్చే వ్యక్తిగత సలహా ఇదేనని ఆయన తెలిపారు. తెలంగాణాలో మాలాంటి నేతలు మానసిక క్షోభకు గురవుతున్నారని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం వల్ల ఎన్టీఆర్ ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. ఎన్ని పనులున్నా.. ఎన్టీఆర్‌‌కు నివాళులు అర్పించేందుకు చంద్రబాబు రావాల్సిందని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు.

సీనియర్ నేత అయిన మోత్కుపల్లి ప్రకటన తెలుగుదేశం పార్టీలో గందరగోళానికి దారి తీసింది. పార్టీలో మరో సంక్షోభానికి ఇది దారి తీస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ నేతలు తెలిపారు.