హైదరాబాద్: ‘మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి’ అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ట్విట్టర్ లో కీలక ప్రకటన చేశారు. తన రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
2009లో ఎన్నికల ప్రచారంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి తాను కొండగట్టు వద్దే క్షేమంగా బయటపడ్డానని, దానికితోడు తమ కుటుంబ ఇలవేల్పు కూడా ఆంజనేయ స్వామి కావడం తన రాజకీయ యాత్రను అక్కడ్నుంచి ఆరంభించేందుకు కారణభూతమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2018
సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్నానని, తన పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తానని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ ఆలయం ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే తన రాజకీయ యాత్రను పవన్ ఏ రోజున కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభిస్తారన్నది ఆదివారం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.