యువతకు ఉపాధి అవకాశాలను కల్పించండి – అసెంబ్లీలో అభ్యర్థించిన ఎమ్మెల్యే చందర్

414
Assembly session

రామగుండాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో తన నియోజికవర్గంలోని పలు సమస్యలపై ఆయన గళం వినిపించారు. నిరుద్యోగుల నిలయంగా మారిన రామగుండంలో ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.

దేశానికి వెలుగులు అందించిన చరిత్ర రామగుండం ఏ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఉందని, 1990 లో ఈ విద్యుత్ కేంద్రం మూతపడిందన్నారు. రాష్ట్రంలో వెలుగులు పంచిన జెన్ కో రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రంలో నూతన ప్లాంట్ ఏర్పాటు చేయాలనీ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రస్తావించడంతో రామగుండం ప్రజలతో పాటు టీఎస్ జెన్ కో సంఘాల నాయకులు, కార్మికుల్లో నూతన ఉత్సాహం పెల్లుబికింది.

కేంద్ర సర్కారు 200 మెగావాట్ల సామర్ధ్యం లోపు గల టీఎస్ జెన్ కో ప్లాంట్లను మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిందని, అందులో భాగంగా నాలుగు మాసాల క్రితం కేంద్ర పరిశీలన బృందం రామగుండం 62.5 మెగావాట్ల ప్లాంటును సందర్శించి పరిశీలించిందని ఎమ్మెల్యే చందర్ స్పీకర్ ద్వారా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. కాగా బీ థర్మల్ ప్లాంటును కేంద్ర బృందం సందర్శించిన సమయంలో బీ థెర్మల్ ప్లాంట్ ఎలాంటి పొల్యూషన్ లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, తగిన ఆధారాలను అందించామన్నారు. మంత్రి కేటీఆర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్, మంత్రి కొప్పుల ఈశ్వర్ గారి సహకారంతో కేంద్ర మంత్రిని కలిసి పరిస్థితిని వివరించడం తో కొంత వెసులుబాటు కల్పించారని సభ దృష్టికి తీసుకెళ్లారు.

రామగుండం పారిశ్రామిక ప్రాంత కారిడార్ లో భాగంగా బీ థర్మల్ ప్లాంట్ లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో బీపీఎల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 1 ,800 ఎకరాల భూమి, నీరు, బొగ్గు అందుబాటులో ఉందని, అంతర్గాములో 509 ఎకరాల మూతపడిన వీవింగ్, స్పిన్నింగ్ మిల్ భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ను సైతం ఏర్పాటు చేయాలనీ కోరారు.

రామగుండం ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా తన నియోజక వర్గ యువకులకే కాక యావత్ తెలంగాణ లోని అనేక మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయని, ఇండస్ట్రియల్ కారిడార్ కి కావలసిన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయని, ఎలాగైనా రామగుండం ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు చూపాలని మంత్రి ని అభ్యర్థించారు.

దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్, రామగుండం ఎమ్మెల్యే చందర్ చెప్పినవి నోటు చేసుకున్నామని, పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రామగుండం ప్రాంత ప్రజలు, కార్మికుల్లో, యువత లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. రామగుండం బీ థర్మల్ ప్లాంటు ప్రస్తావనతో పాటు నూతన ప్లాంటు ఏర్పాటు కోసం అసెంబ్లీ లో మాట్లాడిన ఎమ్మెల్యే చందర్ ను టీఎస్ జెన్ కో రామగుండం బీ థర్మల్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, నియోజక వర్గ నిరుద్యోగ యువకులు అభినందిస్తున్నారు.