హైదరాబాద్ కు ధీటుగా ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో వరంగల్ లో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మహారాష్ట్ర తరహా మెట్రోనియో ప్రాజెక్టును వరంగల్ లో నెలకొల్పాలని యోచిస్తుంది. దీనితో వరంగల్ నగర వాసులకు మెట్రో రైలు సౌకర్యం త్వరలోనే కలుగనుంది.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ‘మహామెట్రో’ DPR (డిటైయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) మూడు నెలల్లో కార్యరూపం దాల్చనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్ల నుంచి రూ.1400 కోట్ల దాకా కావొచ్చని ‘మహామెట్రో’ ప్రతినిధుల బృందం ప్రాథమికంగా అంచనాను తయారుచేస్తుంది. కాజీపేట, పెట్రోల్‌పంప్, పోచమ్మమైదాన్, వెంకట్రామ టాకీస్ మీదుగా వరంగల్ రైల్వే స్టేషన్ వరకు దాదాపు 15కి.మీ పొడవున ఈ రైలు మార్గం ఉండాలని ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్, థానే, పుణె, నాసిక్ వంటి నగరాల్లో అనుసరించిన మార్గంలోనే ప్రాజెక్టు ప్రతినిధులు గత సంవత్సరం డిసెంబర్‌లో వరంగల్‌కు వచ్చి అధ్యయనం చేశారు.
వరంగల్ మహానగరంలో ఉండే ట్రాఫిక్, ప్రైవేటు రవాణా ఎలా ఉంటుంది సాధ్యమౌతుందా ? లేదా ? అనే దానిపై స్టడీ చేశారు.
మెట్రో వస్తే..ప్రజలు ఆదరిస్తారా ? లేదా ? వారి ఆర్థిక, సామాజిక, వ్యాపార పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేస్తూ డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. మహామెట్రో టెక్నికల్ ఎక్స్‌పర్ట్ సభ్యులు, పోలీసులు, ఆర్టీఏ, ఆర్టీసీ, మున్సిపల్ కార్పొరేషన్, రైల్వే నెట్‌వర్క్ వ్యవస్థలపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
రూ.కోటితో డీపీఆర్‌ను రూపొందిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే రెండు మూడు నెలల్లో డీపీఆర్‌కు ఒక రూపం వస్తుందంటున్నారు ప్లానింగ్ అధికారి ఒకరు.