భద్రాచలం బస్టాండ్‌లో మావోయిస్టుల పోస్టర్లు

278
naxal poster

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో శుక్రవారం తెల్లవారు జామున మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఉన్న ఆ కరపత్రాల్లో మోదీ నాలుగున్నరేళ్ల పాలనలో విప్లవ కారులు, ఆదివాసీలు, దళితులు, మైనార్టీ, మహిళలు, హేదువాదులు, రచయితలు, ప్రజాస్వామిక వాదులు, కళాకారులు జర్నలిస్టులను సమాధాన్‌ దాడిలో బూటకపు ఎన్‌కౌంటర్లు, హత్యలు గావించారని ఆరోపించారు. దీన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న సమాధాన్‌ను వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జనవరి 25 నుంచి 31 వరకు ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జనవరి 31 సమాధాన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ బంద్‌ పాటించాలని పేర్కొన్నారు. మండల పరిధిలోని ఉంజుపల్లి రహదారి, జూనియర్‌ కాలేజీ రోడ్‌, పెద్దమిడిసిలేరు, కుదునూరు, దేవరపల్లి, వెంకటాపురం రహదారిపై ఈ కరపత్రాలు వెలిశాయి.




ఈ నెల 31న బంద్‌ పాటించాలని…

రచయితలు, మేధావులు, ప్రజా సంఘాల కార్యకర్తలు, విద్యార్ధులను అక్రమ అరెస్టులు చేసి జైల్లో బంధించడాన్ని తీవ్రంగా ఖండించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అర్బన్‌ నక్సల్స్‌ పేరుతో భద్రాచలం బస్‌స్టాండు ఆవరణలో వాల్‌ పోస్టర్లు వెలిశాయి. బస్టాండు ప్రాంగణంలో పలు చోట్ల ఈ పోస్టర్లను వేయడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఈ పోస్టర్లను చూసిన ఆర్టీసీ ఉద్యోగులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వాటిని తొలగించారు. జన సంచారమున్న ప్రాంతంలో మావోయిస్టులు పోస్టర్లు వేయడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కాలంలో మావోయిస్టులపై పూర్తి ఆధిపత్యాన్ని చాటుతున్నామని పోలీసు అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో మావోయిస్టుల పోస్టర్లు వెలుగు చూడటం పోలీసు అధికారులకు సవాలుగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.