కోడి పందెంలో వ్య‌క్తి మృతి

261

స‌ర‌దాగా ఆడే ఆట‌లు ఒక్కోసారి ప్రాణం మీదికి వ‌స్తాయి. సరదా కోసం ఆడే కోడి పందెం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఊహించని ఘటనకు ఓ నిండు ప్రాణం బలైంది.

కోడి పుంజు కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివ‌రాల్లోకి వెళితే.. కోడి పందేలు ఆడటానికి కోడి కాలికి కత్తి కట్టారు.

అయితే అనుకోకుండా కోడి జంప్ చేయ‌డంతో ఆ కోడి క‌త్తి మర్మాంగాలకు గుచ్చుకుని మృతి చెందాడు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో ఈ ఘ‌ట‌న జరిగింది.

కోడి పందేలకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు తరలివచ్చారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ (45) కూడా తాను పెంచుకుంటున్న కోడితో అక్కడికి వచ్చాడు.

సతీష్ తన కోడిని పందేనికి రెడీ చేసేందుకు ఓ చోట కూర్చుని కోడిని కాళ్ల మధ్యలో పెట్టుకుని కత్తులను కట్టే ప‌నిలో ఉన్నాడు.

ఓ కాలికి కత్తి కట్టాడు. రెండో కాలికి కట్టే స‌మ‌యంలో కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. దానిని గట్టిగా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించాడు.

అయితే ఆ కోడి తప్పించుకునే క్రమంలో అప్పటికే మ‌రో కాలికి కట్టిన కత్తి సతీష్ మర్మాంగానికి తగిలింది. దీంతో అతడి పురుషాంగం, వృషణాలు బాగా దెబ్బతిన్నాయి.

తీవ్ర గాయాలతో సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు వెంటనే అతడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.

కానీ లాభం లేకపోయింది. మార్గంమధ్యలోనే సతీష్ మరణించాడు.