కరీంనగర్ బైపాస్ రోడ్ పై ఇవాళ ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కొప్పుల ఈశ్వర్ ఈ వాహనంలో లేకపోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది. చీఫ్ విప్ కారుకు వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెనుక కారులో ఉన్న సుందరపు గోపాల్ మృతిచెందారు. ఇవాళ సీఎం కరీంనగర్ పర్యటనకు వస్తుండగా అందులో పాల్గొనడానికి ధర్మపురి ఎమ్మెల్యే బయలుదేరే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఛీప్ విఫ్ ఈశ్వర్ డ్రైవర్ కారులో డీజిల్ పోయించుకునేందుకు ఒక్కడే బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డుపై నుంచి బంకులోకి మలుపు తిప్పుతుండగా ఇది గమనించకుండా వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్ మృతి చెందాడు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో వెంటనే వరంగల్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన గోపాల్ తన కుమారుని పెండ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో ఇచ్చేందుకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి వస్తానని చెప్పిన ఇంటి పెద్ద మనిషి ఇలా శవమై తిరిగి వస్తుండటంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.