కేసీఆర్‌ రెండవ సోదరి విమలమ్మ మృతి

310
kcr-sister-vimalamma-was-passed-away

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండో సోదరి విమలమ్మ (83) నిన్న కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని సాయిబాబా నగర్‌లో ఉన్న నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్, ఎంపీ కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు విమలమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని స్వర్గవాటికలో విమలమ్మ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు విజయ భాస్కర్‌ దహన సంస్కారాలు నిర్వహించారు.కన్నీటి పర్యంతమైన కేసీఆర్‌

కాన్వాయ్‌లో నుంచి దిగి సోదరి పార్థివదేహం వద్దకు రాగానే కేసీఆర్‌ ఒక్కసారిగా ఉద్వేగానికిలోనై కన్నీటి పర్యంతమయ్యారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆయన్ను ఓదార్చారు. కేసీఆర్‌కు ఎనిమిది మంది సోదరీమణులు, ఒక సోదరుడు కాగా వీరిలో ఓ సోదరి, అన్న మరణించారు. విమలమ్మకు కేసీఆర్‌ అంటే అమితమైన ప్రేమని, ఏటా రాఖీ కట్టేదని కుటుంబ సభ్యులు చెప్పారు.

KCR 2nd Sister

మంత్రి హరీశ్‌ ఉదయం నుంచి సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విమలమ్మకు భర్త రాజేశ్వర్‌రావు, ముగ్గురు కొడుకులు భూపాల్‌రావు, శ్రీనివాస్, విజయ్‌ భాస్కర్, కుమార్తె చంద్రమతి ఉన్నారు. అంత్యక్రియల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీఎన్‌ రెడ్డి, కార్పొరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు.