ఎ.పి.పి.ఎస్సి గ్రూప్‌–1లో ఫస్ట్‌ ర్యాంకర్స్ వీరే

361
group 1 toppers in APPSC

2011 గ్రూప్‌– 1 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 489.5 మార్కులు సాధించి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆకుల వెంకటరమణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. రమణ బీటెక్‌ చదివేటప్పుడే తండ్రి శ్రీరాములు మృతి చెందగా, తల్లి లక్ష్మీనరసమ్మ రెండేళ్ల కిందట మరణించింది. ప్రస్తుతం రమణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఇదే జిల్లా గిద్దలూరు మండలం సూరేపల్లెకు చెందిన ఖాజావలి బీసీ–ఈ కేటగిరీలో మొదటి ర్యాంక్‌ సాధించారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని రాచర్ల మండలం ఆకవీడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.



పురుషుల విభాగం లో టాప్పర్ వెంకట రమణ

మార్కాపురం పట్టణంలోని 3వ వార్డుకు చెందిన ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మలకు నలుగురు సంతానం. వారిలో మూడో కుమారుడు వెంకటరమణ. స్థానిక మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య, తర్వాత పదో తరగతి వరకు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోను చదివాడు. జార్జి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశాడు. అప్పటివరకు విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలోనే సాగింది. ఇంటర్మీడియట్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైన వెంకటరమణ 2001లో స్థానిక ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరాడు. కానీ అతడి దృష్టి అంతా ఇంజినీరింగ్‌పై ఉండేది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో పట్టుదలతో డిగ్రీ చదువుతూనే ఎంసెట్‌ రాసి, వెయ్యి ర్యాంకు సాధించాడు. గుంటూరులోని నలంద కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న పెద్ద సోదరుడు నరసింహారావు సూచన మేరకు విజయవాడలోని కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌లో చేరాడు. ఆ దశలో తండ్రి శ్రీరాములు మరణించారు. అయినా అన్నదమ్ముల సహకారంతో కష్టపడి చదివాడు. 2005లో ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం చదువుతూనే ప్రాంగణ ఎంపికల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి ఎంపికయ్యాడు. ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరాడు.

మహిళల్లో మొదటి ర్యాంకర్‌ హేమలత

శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట గ్రామానికి చెందిన కనుగుల హేమలత 470 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్, మహిళా విభాగంలో మొదటి ర్యాంక్‌ పొందారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రసాదరావు, సుజాత దంపతుల కుమార్తె హేమలత. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఐదు నుంచి పదోతరగతి వరకు ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్‌ రంగారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలో , డీఈడీ కోర్సును వమరవల్లి డైట్‌లో పూర్తిచేశారు. 2004లో డైట్‌ పూర్తయిన వెంటనే డీఎస్సీ ప్రకటన రావడంతో జిల్లాస్థాయిలో మూడో ర్యాంకును, మహిళల కేటగిరీలో మొదటి ర్యాంకు కైవసం చేసుకుని తొలిసారిగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగంలో చేరారు. 2012లో ఎపిపిఎస్సి నిర్వహించిన అకౌంట్స్‌ అధికారి నియామక పరీక్షకు హాజరై అక్కడా విజయం సాధించారు. ఎస్ జి టి  ఉద్యోగానికి రాజీనామా చేసి పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ ప్రాజెక్టు పరిధిలో అకౌంట్స్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచి పంచాయతీరాజ్‌ శాఖకు మరలి పార్వతీపురంలో డివిజనల్‌ అకౌంట్్స అధికారిగా చేరి ప్రస్తుతం అక్కడే విధుల్లో కొనసాగుతున్నారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, మౌఖిక పరీక్షల్లో తనదైన ప్రతిభచూపి 470 మార్కులు కైవసం చేసుకుని రాష్ట్రస్థాయిలో రెండో స్థానం , మహిళల విభాగంలో టాపర్‌గా నిలిచారు. హేమలత భర్త తవిటినాయుడు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో అటవీ రేంజ్‌ అధికారి.


మహిళల విభాగంలో రెండో ర్యాంక్‌ శైలజ

గ్రూప్‌–1 (2011) పరీక్ష ఫలితాల్లో 434 మార్కులు సాధించి గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన దామరచర్ల శైలజ మహిళల విభాగంలో రెండో ర్యాంక్, జనరల్‌ విభాగంలో 15వ ర్యాంక్‌ సాధించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన పెదయలమంద, లక్ష్మీదేవి దంపతుల రెండో కుమార్తె అయిన శైలజ తండ్రి 11 ఏళ్ల కిందట మరణించడంతో తల్లి కష్టపడి చదివించింది. కాగా.. శైలజ భర్త డాక్టర్‌ రాజేంద్ర ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో విజయవాడ నగర డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.