అమెరికా ఇమ్మిగ్రేషన్‌పై టెన్షన్ పడుతున్న భారత ఐటీ నిపుణులకు ఊరట కలిగింది. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఓ శుభవార్త చెప్పారు.
కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను సులభతరం చేస్తామంటూ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన మాటను బైడన్ నిలబెట్టుకున్నారు.
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా వారిపై నిషేధాన్ని విధించారు.
ఆ నిషేధాన్ని బైడెన్ ఎత్తివేశారు. దీంతో గ్రీన్ కార్డ్ కోరుకునే వారికి భారీ ఉపశమనం లభించినట్టయింది.
కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైందన్న కారణాలతో ట్రంప్ గతేడాది ఈ నిషేధాన్ని తీసుకువచ్చారు.
అమెరికా వర్కర్ల హక్కులను కాపాడే చర్యల్లో భాగంగా గ్రీన్ కార్డుల జారీ వీసాలపై నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ ఆ సమయంలో ప్రకటించారు.
అయితే ట్రంప్ విధించిన ఆంక్షలు సరైనవి కాదని బైడెన్ తన తాజా ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రంప్ ఆంక్షలు అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా అమెరికాలో అనేక కుటుంబాలు తిరిగి కలవలేకపోయాయని బైడెన్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను అమెరికా సంస్థలు కోల్పోతాయని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయాన్ని ఇమ్మిగ్రేషన్ విభాగం అటార్నీ కర్టిస్ మారిసన్
ఆహ్వానించారు. బైడెన్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు.