డీజీపీపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌

204

మ‌హిళా ఐపీఎల్ ఆధికారిని డీజీపీ లైంగికంగా వేధించాడ‌న్న వార్త త‌మిళ‌నాడులో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

కారులో వెళుతున్న స‌మ‌యంలో డీజీపీ రాజేష్ దాస్ త‌న ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌ని మ‌హిళా ఐపీఎస్ అధికారిని ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోప‌ణ‌లపై ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌ని స్వామి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బందోబ‌స్తుకు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు మ‌హిళా ఐపీఎస్ చెబుతున్నారు.

ఈ ఆరోప‌ణ‌ల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. దీనిపై ద‌ర్యాప్తు చేసేందుకు ప్ర‌త్యేక క‌మిటీని నియ‌మిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆ డీజీపీని ప్ర‌భ‌త్వం బ‌దిలీ చేసింది. ద‌ర్యాప్తు క‌మిటీకి త‌మిళ‌నాడు ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ సెక్రెట‌రీ జ‌య‌శ్రీ ర‌ఘేనంద‌న్ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.

ఈ క‌మిటీలో సీమ అగ‌ర్వాల్‌, ఎ. అరుణ్‌, వీకే ర‌మేష్ బాబు, బి. చాముండేశ్వ‌రి వంటి ఐపీఎల్ అధికారులు ఉన్నారు. అంతేకాదు ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌స్టిస్ మిష‌న్‌కు చెందిన లొరెట్టా జానా కూడా ఇందులో స‌భ్యుడుగా ఉన్నారు.

డీజీపీపై వ‌స్తున్న లైంగిక ఆరోప‌ణ‌ల‌పై డీఎంకే తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తోంది. మ‌హిళా అధికారిపై ఓ ఉన్న‌తాధికారి లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని స్టాలిన్‌, క‌నిముళి మండిప‌డ్డారు.

క‌ళంకిత అధికారుల‌ను ప‌ళ‌ని ప్ర‌భుత్వం వెన‌కేసుకొస్తోంద‌ని అన్నారు. ఇటువంటి ప్ర‌భుత్వం మ‌న‌కున్నందుకు సిగ్గుప‌డాలి అని పేర్కొన్నారు.

డీజీపీ అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు డీఎంకే ప్ర‌య‌త్నిస్తోంది. అయితే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న డీజీపీ రాజేష్ దాస్ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై స్పందించ‌లేదు.

మ‌రోవైపు ఈరోజు ప్ర‌ధాని న‌రేండ్ర మోడీ త‌మిళ‌నాడులో పర్య‌టించ‌నున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు.

ఈ నేప‌థ్యంలో బందోబ‌స్తు విధుల‌కు డీజీపీని దూరంగా ఉంచారు.