ఈ నెల 11 నుంచి హైదరాబాద్ నుంచి మాల్దీవులకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. గోఎయిర్ విమానయాన సంస్థ తాజాగా హైదరాబాదు నుంచి నేరుగా మాల్దీవులకు విమాన సర్వీసు నడపాలని నిర్ణయించింది.
మాల్దీవుల రాజధాని మాలే నగరానికి విమానం నడపనుంది. ఈ రెండు నగరాల మధ్య నడిచే తొలి డైరెక్ట్ విమాన సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. ఈ విమాన సర్వీసు వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. సోమవారం, మంగళవారం, గురువారం, ఆదివారం హైదరాబాద్-మాలే విమాన సర్వీసును తిప్పనున్నారు.
గోఎయిర్ ఈ రూట్లో తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాన్ని నడపనుంది. ఉదయం 11.30 గంటలకు హైదరాబాదులో బయల్దేరే ఈ విమానం మాలే కాలమానం ప్రకారం 1.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు మాలేలో బయల్దేరి 5.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.