పెళ్లి పేరుతో రూ. 11 కోట్ల మోసం

270

ఈజీమ‌నీకి చాలా మంది అల‌వాటు ప‌డుతున్నారు. అందులో ఆడా, మ‌గ అనే తేడా లేదు. మోస‌పోకండి.. జాగ్ర‌త్త‌గా ఉండండి అని మీడియా నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా మోస‌పోతూనే ఉన్నారు.

తాజాగా పెళ్లి పేరుతో అక్ష‌రాలా రూ. 11 కోట్లు కాజేసిన ఓ కిలాడి లేడీని హైద‌రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. పెళ్లి పేరుతో కోట్ల రూపాయ‌లు మోసం చేసిన ఓ మ‌హిళ చివ‌రికి క‌ట‌క‌టాల‌పాలైంది.

బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు శ్రుతి సిన్హా. జల్సాలకు బాగా అలవాటు పడింది. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్క‌డం నేర్చుకుంది.

నకిలీ ఐపీఎస్‌ అధికారి అవతారమెత్తింది. వీరారెడ్డి అనే వ్యాపారిపై కన్నేసిన శ్రుతి తన మాయ మాటలతో అతడిని మచ్చిక చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించింది.

శ్రుతి మాయలో పడిన వ్యాపారి.. ఆమె అడిగినంత డబ్బు ఇవ్వడం మొదలు పెట్టాడు. అలా.. వ్యాపారి నుంచి పలు ద‌ఫాలుగా మొత్తం రూ.11 కోట్లు తీసుకుంది.

డబ్బు చేతికి అందాక శ్రుతిలో మార్పు వచ్చింది. కొద్ది రోజుల తర్వాత వీరారెడ్డికి అసలు విషయం అర్థమైంది.

తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబో మన్నాడు. వెంటనే పోలీసులను అశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

కిలాడీ లేడీ శ్రుతి సిన్హాని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రుతి నుంచి పోలీసులు రూ.6 కోట్ల విలువైన ఆస్తుల‌తో పాటు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఖరీదైన కార్లు, విల్లా స్వాధీనం చేసుకున్నారు. శ్రుతి సిన్హా లగ్జరీ లైఫ్ చూసి పోలీసులే కంగుతిన్నారు.

మాయ మాటలతో, పెళ్లి పేరుతో ఇంకా ఎంతమందిని మోసం చేసిందో తెలియాల్సి ఉందంటున్నారు పోలీసులు.

ఆమె చేతిలో మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.

ఈ కేసులో బాధితుడైన వ్యాపారి వీరారెడ్డి తీరు కూడా చర్చకు దారితీసింది. ఆమెని నమ్మి ఏకంగా రూ. 11 కోట్లు ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది.

అంత డబ్బు పోతే కానీ ఆయనకు కనువిప్పు కలగకపోవడం విడ్డూరంగా ఉందని పోలీసులు అంటున్నారు.

ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసాలు చేసే వారు ఎక్కువైపోయారని, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ముందూ వెనుక ఆలోచన చేయకుండా అపరిచిత వ్యక్తులతో స్నేహం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.