మార్చి 1 నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్

274

చాప‌కింద నీరులా మ‌రోసారి క‌రోనా వైర‌స్ వ్యాపిస్తున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం ఓ శుభవార్త చెప్పింది. మార్చి 1 ఒకటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది.

వీరితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీరందరికీ కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది.

ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ బుధవారం (24-2-2021) తెలిపారు.

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం.. ఆ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు వ‌స్తున్న వార్తలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

భారత్‌లో రెండు రకాల కొత్త కరోనా వేరియంట్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించిన విష‌యం తెలిసిందే.

N440K, E484K అనే రెండు రకాల వేరియంట్లను మహారాష్ట్ర, కేరళతో పాటు తెలంగాణలోనూ గుర్తించినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.

భారత్‌లో కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ను అందించినట్లు వెల్లడించింది.

వీరిలో 1,07,67,198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మొదటి డోసు అందించగా.. 13,98,400 మందికి రెండో డోసు కూడా వేసినట్లు తెలిపింది.