భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

200

తాగుడుకు బానిసై అనుమానం పెంచుకొని కట్టుకున్న భార్యను గొడ్డలితో నరికి హతమార్చాడు ఓ భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం చెర్లపల్లిలో  జరిగింది.

కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. చెర్లపల్లికి చెందిన అశినేని శంకరయ్యకు 15 ఏళ్ల క్రితం జగిత్యాల మండలం అంబారిపేటకు చెందిన సుజాతతో వివాహం జరిగింది.

వారికి ఇద్దరు పిల్లలు. అభిరాం (12), అజయ్‌(11). శంకరయ్య తాగుడు బానిసై ఏ పనీ చేసేవాడు కాదు. సుజాత కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించేది.

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ముంబైకి వెళ్లి కల్లు దుకాణంలో పని చేసేవాడు.   రెండు, మూడు నెలలకోసారి ఇంటికి వచ్చేవాడు. నెల క్రితం వచ్చి ఇక్కడే ఉంటున్నాడు.

సుజాతపై అనుమానం పెంచుకున్నాడు. నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. తరచూ గొడవ జరుగుతుండేది. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

దీంతో కోపాన్ని తట్టుకోలేక తెల్లవారుజామున బాత్రూంలో సుజాతను గొడ్డలితో నరికి హతమార్చాడు. సుజాత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.