హైదరాబాద్ నగరంలో ఓ భార్య తన భర్తపై కిరాతకంగా ప్రవర్తించింది. భర్తపై వేడి నూనె పోసి కారం చల్లి పరారైంది. ఈ ఘటన నగరంలోని జగద్గిరిగుట్టలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భార్యతో పాటు పిల్లలుకూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.
బాధితుడు కాలిన గాయాలతో పెద్దగా కేకలు వేయడంతో ఆ తల్లీకూతుళ్లు ఇంటి నుంచి పారిపోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య, రజిత గత కొంతకాలం క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్ట దీనబందు కాలనీలో నివాసం ఉంటున్నారు.
సదయ్య కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే గత నెలలో కుటుంబ కలహాల వల్ల రజిత పుట్టింటికి వెళ్లి పోయింది. వారం క్రితమే భర్త దగ్గరికి వచ్చింది.
మళ్లీ వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
సదయ్య వ్యాపారానికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సమయంలో అతను ఇంట్లోకి రాకుండా అతని భార్య, కూతురు ఇంటి గేటుకు తాళం వేసేసుకున్నారు.
గేట్ తీయాలని ఎంత పిలిచినా రాలేదు. దాంతో సదయ్య పక్క ఇంట్లో నుంచి తన ఇంట్లోకి వెళ్లాడు.
అయితే సదయ్యపై ఆగ్రహంగా ఉన్న తల్లీ, కూతుళ్లు అతనిపై అప్పటికే కాగుతున్న వేడి వేడి నూనెను పోశారు.
అంతటితో ఆగక కారం చల్లారు. దాంతో నూనె వేడిమిని తట్టుకోలేక సదయ్య గట్టిగా అరిచాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చేసరికి తల్లీకూతుళ్లు పారిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.