నేడు మహిళా దినోత్సవం. ప్రపంచమంతా మహిళలను పొగిడేస్తున్న వేళ ఏపీలో ఓ ఘోరం జరిగింది.
మహిళా దినోత్సవం రోజునే కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు ఓ మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు.
ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గజపతిరాజు వెంట టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు.
అయితే ఓ మహిళా కార్యకర్త తమ అభిమాన నేత వచ్చాడనే సంతోషంలో అశోక్ గజపతి రాజుపై పుష్పాలు జల్లింది.
పక్కనే ఉన్న మరో మహిళా కార్యకర్త ఆమెను వారించింది.
ఆ సమయంలోనే సహనం కోల్పోయిన అశోక్ గజపతి రాజు సదరు మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్నారు.
ఆమె చేతిలో ఉన్న పుష్పాలను కింద పడేసి ఆమెను కొట్టారు. ఆ ఘటనను చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు.
కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తి ఓ మహిళపై చేయి చేసుకోవడం ఏంటి? అది కూడా సొంత పార్టీ కార్యకర్తను కొట్టడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
కాగా, అశోక్ గజపతి రాజు చేయి చేసుకోవడంతో సదరు టీడీపీ మహిళా కార్యకర్త వెనక్కి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఇదిలాఉంటే.. ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ టీడీపీ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన విషయం తెలిసిందే.