
హైకోర్టు న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని కవలచర్ల వద్ద బుధవారం వామనరావు, నాగమణి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఏ1గా వసంతరావు, ఏ2గా కుంట శ్రీను, ఏ3గా కుమార్ లపై కుట్ర, హత్య అభియోగాలు మోపారు. వారిపై ఐపీసీ 120బి, 302, 341, 34 కింద కేసు నమోదు చేశారు.
వామనరావు పై దుండగులు దాడి చేయగా కొద్దిసేపు రోడ్డుపై కొనప్రాణంతో కొట్టుమిట్టాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ కుంట శ్రీను పేరు చెప్పినట్టు తెలుస్తోంది.
కుంట శ్రీను కూడా వామనరావు స్వగ్రామం గుంజపడుగుకు చెందినవాడే కావడం గమనార్హం.
ఓ స్థలం విషయంలో వామనరావు హైకోర్టులో పిల్ వేయగా తనకు అడ్డురావొద్దంటూ కుంట శ్రీను హెచ్చరించినట్టు సమాచారం. ఈ హత్యకు భూ వివాదమే కారణం కావొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.