సినీ, రంగస్థల నటుడు శ్రీనివాస దీక్షితులు మృతి

318
Film and film actor died

సినీ, రంగస్థల కళాకారుడు దీవి శ్రీనివాస దీక్షితులు(62) సోమవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని నాచారం స్టూడియోలో సినీ దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా రూపొందిస్తున్న సిరిసిరిమువ్వ టీవీ సీరియల్‌లోని ఓ సన్నివేశంలో నటిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఆయన భార్య లక్ష్మీచిత్రలేఖ మూడేళ్ల క్రితం కన్నుమూశారు. కుమార్తె, కుమారుడు ఉన్నారు. అక్కినేని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మీడియా యాక్టింగ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన ప్రస్తుతం సేవలందిస్తున్నారు.




 

రూరల్‌ మండలం కొలకలూరుకు చెందిన ఆయన రేపల్లెలో విద్యాభ్యాసం చేసి అధ్యాపక వృత్తిలో స్థిరపడ్డారు. థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొంది పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. టీవీ రంగంలో అడుగిడి పలు సీరియల్స్‌లో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఆగమనం సీరియల్‌ నంది అవార్డు గెలుచుకుంది. మురారి సినిమాలో పూజారి పాత్రలో నటించిన ఆయన 62 సినిమాలలో తన నటనతో మెప్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.

ఆయన నటనను మెచ్చి పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం, గరికపాటి రాజారావు అవార్డులు, ఉగాది పురస్కారాలు కూడా ఆయనకు కట్టబెట్టారు. తెనాలి రంగస్థలంతో అవినాభావ సంబంధం ఉన్న ఆయన తరచూ తెనాలి వచ్చి ఇక్కడ జరిగే కళా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనేవారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దే కమిటీలో కూడా చురుకుగా పని చేసి ప్రధాన భూమిక పోషించారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, ప్రజ్వలిత అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్‌, రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ జానీబాషా, సత్యనారాయణశెట్టి, హకీం జానీ, పలువురు కళాకారులు, సాహితీ వేత్తలు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.