తన 17 సంవత్సరాల కుమార్తెను తల నరికి దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లక్నో సమీపంలో చోటుచేసుకొంది.
పోలీసుల కథనం ప్రకారం లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ అనే వ్యక్తి కుమార్తెను తల నరికి చంపేశాడు.
నరికేసిన తలను చేత్తో పట్టుకుని నడుస్తుండగా గ్రామస్థులు గమనించారు. ఆ తల ఆయన కుమార్తెదేనని గుర్తించి ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఇద్దరు పోలీస్ అధికారులు సర్వేశ్ నడుస్తున్న మార్గానికి ఎదురొచ్చి, అడ్డగించారు.
వారి మధ్య జరిగిన సంభాషణను వీడియో తీశారు. తొలుత అతని పేరు అడిగి, ఆ తల ఎవరిదని ప్రశ్నించగా అది తన కుమార్తెదని చెప్పాడు. హత్య చేసింది తాను ఒక్కడినేనని పేర్కొన్నారు.
ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు.
మిగతా శరీరభాగం ఇంట్లోనే ఉందని చెప్పాడు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.