ఉన్నత చదువులు చదివింది. సమాజంలో గౌరవప్రదమైన ఎస్సై ఉద్యోగ పరీక్షలో అర్హత సాధించింది. కానీ, వక్రబుద్ధి ఆమెను హంతకురాలిగా మార్చింది. ఎస్సై బాధ్యతలు చేపట్టాల్సిన ఆమె కటకటాల్లో చేరింది. పెళ్లి నాటి ప్రమాణాలను, సమాజ కట్టుబాట్లను మంటలో కలిపి మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడితో సుఖం కోసం కట్టుకున్న భర్తను కిరాతకంగా కడతేర్చింది. హైదరాబాద్‌లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది.
సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు. భార్య సంగీత, పిల్లలతో కలిసి బోరబండలో నివాసం ఉంటున్నారు. కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో సంగీతకు వరసకు మేనల్లుడయ్యే విజయ్ నాయక్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.
సంగీత, విజయ్ సంబంధం గురించి తెలుసుకున్న శ్రీనివాస్.. తీరు మార్చుకోవాలంటూ భార్యను హెచ్చరించాడు. కానీ, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త శ్రీనివాస్ అడ్డు తొలగించుకోవాలని సంగీత నిర్ణయం తీసుకుంది. మేనల్లుడు విజయ్‌తో కలిసి హత్యకు కుట్ర పన్నింది.
కరెంట్ షాక్‌తో చనిపోడని ప్లాన్ ఛేంజ్..
శ్రీనివాస్‌ను మొదట కరెంట్ షాక్‌కు గురి చేసి హత్య చేయడానికి సంగీత కుట్ర పన్నింది. కానీ, మేనల్లుడి సలహాతో ప్లాన్ మార్చింది. ఐటీఐ చేసిన శ్రీనివాస్ కరెంట్ షాక్‌తో చనిపోడని.. ప్లాన్ వికటిస్తే తమకు ప్రమాదమని భావించిన నిందితులిద్దరూ.. అతడు నిద్రిస్తుండగా హత్య చేయాలని కుట్ర పన్నారు.
ఫిబ్రవరి 1 అర్ధరాత్రి ఎప్పటిలాగే విధుల నుంచి తిరిగొచ్చిన శ్రీనివాస్.. ఆదమరచి నిద్రిస్తున్నాడు. వెనుక ద్వారం ద్వారా అప్పటికే విజయ్ ఆ ఇంటికి చేరుకున్నాడు. అదను కోసం చూస్తున్న నిందితులిద్దరూ నిద్రిస్తున్న శ్రీనివాస్ తలపై బండరాయితో బలంగా మోదారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అరుపులు వినిపించకుండా.. సమీపంలోని రైల్వే ట్రాక్ పైనుంచి రైలు వచ్చే సమయంలో దాడి చేశారు.
రైల్వే ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం..
శ్రీనివాస్‌ను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగీత, విజయ్.. అనంతరం ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీనివాస్ మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి అప్పటికే సిద్ధం చేసుకున్న చాపలో పెట్టి నెట్ (దోమ తెర)తో బిగ్గరగా కట్టారు. దాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి బోరబండ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కన పడేశారు. అనంతరం ఇంటికెళ్లి రక్తపు మరకలు కనిపించకుండా శుభ్రం చేశారు.
ఫిబ్రవరి 2న ఉదయం రైల్వే ట్రాక్ పక్కన మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు, స్థానికులు సనత్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహం రైల్వే ట్రాక్‌కు దూరంగా ఉండటం, తలకు మాత్రమే తీవ్రమైన గాయం ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేకాకుండా మృతదేహాన్ని ఈడ్చుకొచ్చి పడేసిన ఆనవాళ్లు కనిపించాయి.
పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. రక్తపు మరకల ఆనవాళ్లను పసిగడుతూ వెళ్లిన శునకం.. శ్రీనివాస్ ఇంటి వద్ద ఆగిపోయింది. భార్య ప్రవర్తన తీరుపై అనుమానం వచ్చిన పోలసులు ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. దారుణం వెలుగులోకి వచ్చింది.
రెండు నెలల కోసం ఇంట్లో ఆశ్రయమిస్తే..
సంగీతకు విజయ్ నాయక్ తొలిసారిగా మూడేళ్ల కిందట ఓ ఫంక్షన్‌లో పరిచయమయ్యాడు. అనంతరం 2016 ఆఖర్లో రెండు నెలల పాటు ఉంటానని మామ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్.. తన మేనల్లుడిని ఇంటి నుంచి పంపించేశాడు. భార్యను తన ప్రవర్తన మార్చుకోమని తీవ్రంగా హెచ్చరించాడు. కానీ, మేనల్లుడితో సంగీత తన సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తూ వచ్చింది.
భర్త డ్యూటీకి వెళ్లిపోయాక..
అర్ధరాత్రులు అల్లుడు ఇంట్లోకి ప్రవేశించడానికి సంగీత.. వెనకనున్న ప్రహారీ గోడకు కన్నం పెట్టింది. ఆ కన్నం ద్వారా ఎవరి కంటా పడకుండా విజయ్ ఆ ఇంట్లోకి వచ్చేవాడు. మేనత్తతో ఏకాంతంగా గడిపి మామ శ్రీనివాస్ తిరిగొచ్చే సరికి వెళ్లిపోయేవాడు. తన భర్త రైలు ప్రమాదంలో మరణించాడని నమ్మిస్తే.. అతడి ఉద్యోగం కూడా తనకు వస్తుందని సంగీత భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. అదే జరిగితే.. భర్త అడ్డు తొలగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, మేనల్లుడితో సుఖం దక్కుతుందని నిందితురాలు ప్రణాళిక వేసింది.