
బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన తమిళనాడులోని శివకాశి ప్రాంతంలో చోటుచేసుకొంది.
తరచుగా శివకాశి ప్రాంతంలోని బాణసంచా తయారీ కర్మాగారాల్లో పేలుళ్లు జరుగుతుంటాయి.
గత కొన్నిరోజులుగా పేలుళ్లతో దద్దరిల్లుతున్న శివకాశి ప్రాంతంలో నేడు కూడా భారీ పేలుడు ఘటన జరిగింది.
విరుదునగర్ జిల్లా కాళయ్యర్ కురిచ్చిలోని ఓ బాణసంచా పరిశ్రమలో ఫ్యాన్సీ రకం టపాకాయలు తయారుచేస్తుండగా విస్ఫోటనం సంభవించింది.
ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పేలుడు ధాటికి 10 గదులు నేలమట్టం అయ్యాయి. మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు.
శివకాశి ప్రాంతంలో గత రెండు వారాల వ్యవధిలో మూడోసారి పేలుడు ఘటన సంభవించడం విషాదకరం.