ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ (72) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బసవతారకం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఇటీవల తూళ్లూరు పోలీసులు కోడెలపై అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కోడెల కొడుకు శివరాం, కూతురుపై ట్యాక్స్ వేధింపుల కేసులుతో తీవ్ర మనస్థాపంకు గురైనట్లు సమాచారం. కోడెల ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. కోడెలకు గుండెపోటు వచ్చిందని బసవతారకం ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగానే కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుచరులు చెబుతున్నారు.
1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో కోడెల చేరారు. 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమి చెందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన కోడెల 2014 నుంచి 2019 వరకు స్పీకర్ గా పనిచేశారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తొలి శాసనసభాపతిగా కోడెల శివప్రసాదరావు పనిచేశారు.