చెన్నై : అన్నాడిఎంకె బహిష్కృత నేత టిటివి దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచేర్రి లో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అన్నా డి ఎం కె వ్యవస్థాపక అధ్యక్షుడు , మాజీ సి.ఎం ఎం జి ఆర్ జయంతి వేడుకల నేపథ్యం లో దినకరన్ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొన్నీమద్యే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని అన్నా డి ఎం కె నుండి బయటకు రావాలంటూ ఆ సందర్భం లో దినకరన్ నేతలకు పిలుపునిచ్చాడు. శశికళ జైలుకెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి , పన్నీర్ సెల్వం తో కలిసి అన్నాడిఎంకె పార్టీ పై పట్టు సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమం లో శశికళ-దినకరన్ వర్గం పై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓ వైపు పార్టీ లో సభ్యత్వం , మరో వైపు రెండాకుల గుర్తు ను కూడా కోల్పోయిన నేపథ్యం లోనే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్టు స్పష్టమవుతుంది.