ప్రతీ వస్తువును ఆన్‌లైన్ ద్వారానే అందించేందుకు ప్రయత్నిస్తున్న ఈ కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు పండగల సందర్భంగా ఉపయోగించే పిడకలను సైతం అమ్మేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు పండగల సీజన్లో ఫోన్లు, బట్టలు, గృహోపకరణాలు, టపాసులే అందించిన ఆన్‌లైన్ స్టోర్లు.. ఇప్పుడు పిడకలను అమ్మేస్తున్నాయి. కొన్ని ఈ కామర్స్ సైట్లు ఇప్పటికే ఈ పని మొదలుపెట్టాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పిడకలను నవరాత్రి పూజల్లో, దీపావళి రోజున ఉపయోగిస్తారు. ఇందుకోసం అమెజాన్, షాప్‌క్లూస్, హోంషాప్18, బిగ్ బాస్కెట్ లాంటి ఆన్‌లైన్ సంస్థలు పూజా సామాగ్రితోపాటు పిడకలను కూడా అమ్మకానికి పెట్టాయి.
భోగి పండుగును గ్రామాలలో సంప్రదాయ రీతిలో జరుపుతారు. గ్రామాలలో భోగి పండుగ రోజు ఆవు పేడతో చేసిన పిడకలతో భోగిమంటలు వేయడం గ్రామాల్లో ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ సిటీలలో ఉన్నవారికి ఆవు పేడతో చేసిన పిడకలు దొరకడం చాలా కష్టం. దీంతో సిటీలలో ఉండే ప్రజలు ఇంట్లోని పాత వస్తువులు, చెత్త, వంటి వాటితో భోగి మంటలను వేస్తున్నారు. అయితే సిటీలలో ఉండే వారు కూడా సంప్రదాయరీతిలో పండుగ జరుపుకోవచ్చు అని అంటుంది ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్. “ప్యూర్ కౌ డంగ్ కేక్” పేరుతో ఆన్ లైన్ లో అమెజాన్ ఆవు పేడతో చేసిన పిడకలను విక్రయిస్తుంది. దీంతో చాలామంది సిటీ ప్రజలు వీటిని ఆర్డర్ చేయుటకు ఆశక్తి చూపిస్తున్నారు.
అంతేగాక, వీటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటించడం గమనార్హం. కాగా, పిడకలను 4, 11, 24 చొప్పున ప్యాకెట్లలో అమ్ముతున్నారు. ఓ సైట్లో 4 పిడకల ప్యాకెట్ ధరను రూ. 40, 24 పిడకల ధర రూ. 150గా నిర్ణయించారు. పట్టణ ప్రజలు నుంచి వీటికి మంచి ఆదరణ లభిస్తోందంటున్నాయి ఈ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు.