వైసీపీలోకి దగ్గుబాటి తనయుడు

239
Hitesh Join in YSRCP

తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు కుమారుడు హితేశ్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకొన్నారు. వైసీపీతో కలిసి పనిచేయడానికి తన కుమారుడు నిర్ణయించుకొన్నారని వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైసీపీ అధినేత జగన్ నివాసంలో..ఆయనతో దగ్గుబాటి, ఆయన కుమారుడు హితేశ్ చెంచురామ్ సమావేశమయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి వారికి స్వాగతం పలికారు. జగన్‌తో భేటీ అనంతరం వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు వైసీపీతో కలిసి పనిచేసే అంశంపై జగన్‌తో చర్చించామని, పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

ప్రకాశం జిల్లా పర్చూరు టిక్కెట్ గురించి ఈ సమవేశంలో చర్చించినట్లు సమాచారం. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు దగ్గుబాటి నేరుగా జవాబివ్వలేదు. పార్టీయే నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. తన భార్య పురంధేశ్వరి రాజకీయాల్లో ఉంటే బీజేపీలోనే ఉంటారని.. లేకుంటే రాజకీయాలనుంచి తప్పుకొంటారని తెలిపారు. ఏపీలో ప్రభుత్వ పనితీరు గాడితప్పిందని, డబ్బుల్లేవంటూ దీక్షల పేరిట కోట్ల రూపాయలు ఖర్చుచేయడం సరికాదని దగ్గుబాటి అన్నారు.