సమాచారమిచ్చిన యువకుడిపై సీఐ తిట్ల పురాణం

456
chatrinaka-inspector-abused-youth

సమాచారం ఇవ్వడంలో భాగంగా ఓ యువకుడు ఛత్రినాక ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేయడంతో, ఇన్‌స్పెక్టర్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు విరుద్ధంగా అసభ్యకరమైనరీతిలో మాట్లాడాడు. ఈ వాయిస్‌ను రికార్డు చేసి సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిని తీవ్రంగా పరిగణించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెంటనే విచారణకు ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి భిన్నంగా ఇన్‌స్పెక్టర్ ఫోన్‌లో మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇన్‌స్పెక్టర్‌కు వెంటనే ఛార్జీమెమో జారీ చేసి, ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గౌలిపురా డివిజన్ పటేల్‌నగర్‌లో నివాసముండే సర్వేశ్వర్ అనే యువకుడు గురువారం రాత్రి 11గంటల సమయంలో ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కుమార్‌కు ఫోన్ చేశాడు. బూడిదగడ్డవైపు నుంచి ఇండ్లపై సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రాళ్లు పడ్డాయంట సారు అంటూ సమాచారం ఇచ్చాడు. ఎన్ని గంటలకు పడ్డాయంటూ ఇన్‌స్పెక్టర్ మరోసారి అడిగాడు.. 6 గంటలకు పడ్డాయని చెప్పడంతో.. 6 గంటలకు పడితే ఇప్పుడేందుకు చేశావంటూ ఇన్‌స్పెక్టర్ గట్టిగా మాట్లాడాడు. నేను తన విధి నిర్వాహణలో భాగంగా బయటకు వెళ్లి.. ఇప్పుడే వచ్చాను.. మా ఇంట్లో వాళ్లు చెప్పారు సార్ అంటూ.. ఇన్‌స్పెక్టర్‌కు సమాధానం చెప్పడంతో ఇన్‌స్పెక్టర్ అసభ్య పదజాలంతో ఆ యువకుడిపై విరుచుపడ్డాడు. ఇన్‌స్పెక్టర్ తిట్ల పురాణాన్ని ఆ యువకుడు సెల్‌ఫోన్లో రికార్డు చేసి, దానిని సోషల్‌మీడియాలో సర్క్యులేట్ చేశాడు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రజలతో ప్రతి ఒక్క పోలీసు అధికారి ఎంత ఒత్తిడిలో ఉన్నా మర్యాదగా మాట్లాడాలని ఉన్నతాధికారులు తరచూ సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అయినా కూడా తన తీరు మార్చుకోకుండా ఓ ఇన్‌స్పెక్టర్ అలా మాట్లాడిన పద్ధతిపై ఉన్నతాధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీపీ విచారణకు ఆదేశించారని సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.


ఎంత పని ఒత్తిడి ఉన్నా..సామాన్య ప్రజలతో మాట్లాడే సమయంలో సంయమనంతో మాట్లాడిల్సిన అవసరముంటుందని డీసీపీ సిబ్బందికి సూచించారు. సోషల్‌మీడియాలో వైరల్ అయిన వాయిస్ రికార్డింగ్‌పై దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో ఆ వాయిస్ రికార్డు విషయంపై అన్ని విషయాలు తెలుస్తాయని డీసీపీ
వెల్లడించారు.