తాజ్‌మహల్‌‌ సందర్శన కు ఇక పై మూడు గంటలే పర్మిషన్

393
tajmahal visiting hours only 3 hours soon

ప్రేమకు ప్రతిరూపం తాజ్‌మహల్‌.. అందుకే ప్రేమికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తాజ్‌ను వీక్షిస్తుంటారు. అయితే అలాంటి వారికి ఓ చేదు వార్తనే చెప్పాలి. ఎందుకంటే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజ్‌మహల్ వీక్షణ సమయాన్ని కుదించింది. రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే తాజ్‌ను వీక్షించేందుకు పర్యాటకులకు అవకాశం కల్పించనుంది. అంటే ఒకసారి టికెట్ తీసుకుంటే కేవలం మూడు గంటలు మాత్రమే తాజ్‌ను దగ్గరి నుంచి వీక్షించవచ్చన్నమాట. అంతకు మించి సమయం కేటాయించాలనుకుంటే మరో టికెట్ కొనుక్కోవాల్సిందేనట. ఈ మేరకు పురావస్తు శాఖ ఓ నోటీసును కూడా జారీ చేసింది. తాజ్‌ను చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. అయితే పర్యాటకుల తాకిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

యమునా తీరంలో నిర్మితమైన ఈ కట్టడాన్ని చూసేందుకు రోజుకు 50 వేల మందికి పైగానే వస్తుంటారు. అయితే ఈ రద్దీని తగ్గించి, సందర్శన సమయంపై పరిమితి విధించాలని కొందరు పర్యావరణ విశ్లేషకులు సూచించారట. దీంతో పురావస్తు శాఖ కూడా తాజ్‌ను సహజ శోభితంగా కాపాడడం కోసం సమయాన్ని మూడు గంటలకు కుదించారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని కూడా నియమించారని సమాచారం.