ఆస్ట్రేలియాలో స్థిరపడాలని.. అన్నాచెల్లెళ్లు ఎంత పని చేసారో తెలుసా?

330
Australian visa

ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పచుకునేందుకు అన్నాచెల్లెలు ఆడిన పెళ్లి నాటకం బట్టబయలైంది. నకిలీ పత్రాలతో భార్యాభర్తలుగా చెలామణి అవుతున్న వీరి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన పేరుతో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఇదంతా చేశారని వీరి బంధువు ఒకామె పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడిందని ఆస్ట్రేలియా వార్తా సంస్థ ఎస్‌బీఎస్‌ డాట్‌కామ్‌ వెల్లడించింది. ఫిర్యాదు ఆధారంగా బథిండా జిల్లాలోని బాలియన్‌వాలా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరితో పాటు వారి ఆరుగురు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌ పేర్కొన్నట్టు బాలియన్‌వాలా ఎస్‌ఐ జైసింగ్‌ తెలిపారు.
 

ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం ఉంటున్న నిందితుడు తన సోదరిని కూడా అక్కడికి తీసుకెళ్లేందుకు ఈ నాటకం ఆడాడు. ముందుగా తన సమీప బంధువు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటితో గరుద్వారా నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం తీసుకుని, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేయించారని జైసింగ్‌ వివరించారు. 2012లో జరిగిన ఈ ఉదంతం​ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరూ ఆస్ట్రేలియాలోనే ఉన్నారని, తాము దర్యాప్తు పూర్తి చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఈ కేసు తమను షాక్‌కు గురి చేసిందని పోలీసులు తెలిపారు. వీసా కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతుండడం తాము చూశామని, అన్నాచెల్లెలు పెళ్లి చేసుకున్నట్టుగా నటించడం ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యపోయారు.

నకిలీ పెళ్లి పత్రాలతో తమ దేశానికి రావాలని చూస్తే కఠిన దండన తప్పదని భారతీయులకు గతేడాది ఆస్త్రేలియా హెచ్చరిక జారీ చేసింది. 32 ఏళ్ల భారతీయుడొకరు నిరుడు నవంబర్‌లో నకిలీ వివాహ పత్రాలతో దొరికిపోవడంతో ఈమేరకు వార్నింగ్‌ ఇచ్చింది. ఫోర్జరీ సర్టిఫికెట్లు సమర్పించారన్న కారణంతో 164 మందికి భాగస్వామ్య వీసాలు నిరాకరించినట్టు ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ తెలిపింది.